ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 8కి చేరాయని వైద్యవిద్య సంచాలకుడు వెంకటేశ్‌ తెలిపారు. లండన్‌ నుంచి తిరుపతి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మక్కా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి కుమార్తెకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. అనంతపురం బోధనాస్పత్రిలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలో కడప, విశాఖలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెంకటేశ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు లాక్​డౌన్​ పోలీసులు నియంత్రణతో పూర్తిస్థాయిలో అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు మూసివేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిత్యావసరాల దుకాణాలు సైతం ఉదయం పది గంటల తర్వాత మూసి వేయించారు పోలీసులు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

ఇక మరో పక్క, కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. లాక్​డౌన్ ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం కోరుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లలో ఉదయం 7 గంటలకే కూరగాయలు అయిపోతున్నాయి. ఇదే అదునుగా దళారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కష్టకాలంలో ప్రజలకు బాసటగా నిలిచేందుకు ముందుకువచ్చారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన తోట వెంకయ్య.

సుమారు 50 వేల రూపాయలతో కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో ఉచితంగా పంపణీ చేశారు. రెండు రోజుల నుంచి కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ నెల 31 వరకు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని తోట వెంకయ్య తెలిపారు. దాతలు మరికొంత మంది ముందుకొస్తే ప్రజల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ రెండోరోజుకూ మంచి స్పందన వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, స్వచ్ఛందంగా సహకరించారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందని చెప్పారు. కరోనా నివారణ చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలో విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ప్రజలకు డీజీపీ సవాంగ్ సూచించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరుతున్నామన్న డీజీపీ... విదేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గ్రహించి ప్రవర్తించాలని సూచించారు. అవసరం లేకుండా తిరిగేవాళ్ల వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 298 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విదేశాల నుంచి వచ్చేవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారన్న డీజీపీ... అలాంటి వారిపై కేసులు పెట్టి పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లోనూ ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై ప్రతిరోజూ ఆంక్షలు పెరిగే అవకాశం ఉందన్న డీజీపీ సవాంగ్‌... అత్యవసర సమయాల్లోనూ కారులో ఇద్దరినే అనుమతిస్తామని చెప్పారు. ఏపీకి వచ్చే అన్ని రహదారులను పూర్తిగా మూసివేస్తున్నామని డీజీపీ తెలిపారు. రాత్రి నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వాహనాలను అనుమతించట్లేదని పేర్కొన్నారు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రహదారుల మూసివేత కారణంగా ప్రజలెవరూ రాకపోకలు కొనసాగించరాదని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ వాయిదా వేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంగన్వాడీలు ఇళ్ల వద్దకే వచ్చి పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఒకేచోటకు రాకుండా పలుచోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిపివేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ.. తాజా బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఏడుకు పెరిగినట్టు తెలిపింది. ఆస్పత్రి నుంచి ఓ బాధితుడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేశామని ప్రకటించింది. బులెటిన్ లో ఉన్న వివరాల ప్రకారం.. విశాఖ విమానాశ్రయం, పోర్టుల నుంచి వచ్చిన 12,082 మందికి అధికారులు స్క్రీనింగ్ పూర్తి చేశారు. అలాగే.. రాష్ట్రానికి 14,038 మంది విదేశీ ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించారు. అందులో.. 2426 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో 11,526 మంది ఉన్నారు. 86 మందిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 220 మంది నమూనాలు పరీక్షలకు పంపించగా.. ఏడుగురికి పాజిటివ్‌, 168 మందికి నెగిటివ్‌గా తేలింది. మరో 45 మంది నమూనాల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లురు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 31 వరకు 144 సెక్షన్‌ అమలవుతుందని తెలిపారు.

కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా అధికారులతో కలెక్టర్ వినయ్ చంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండేలా తీసుకోవలసిన చర్యలను కలెక్టర్ వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపేలా గ్రామ, పట్టణ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు వివరించారు. కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరో పక్క,జనంలో భారీగా కనిపించిన జనతా కర్ఫ్యూ స్ఫూర్తి... లాక్‌డౌన్‌లో కరువైంది. ఆదివారం ఇంటి నుంచి కదలని పౌరులు కర్ఫ్యూ పూర్తైన అనంతరం రోడ్లపై కనిపించారు. సామాజిక దూరం పాటింపును పూర్తిగా పక్కన పెట్టేశారు. అత్యవసరాలో.. మరేదోగానీ రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ రద్దీ కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని నియంత్రించాక మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను నియంత్రించారు. చాలామంది అవగాహన లేమితో సమస్య మరింత పెరిగింది. రైతుబజార్లు, దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసరాల కోసం ఒకరిపై మరొకరు ఎగబడ్డారు. ఆటోలు, ట్యాక్సీల రాకపోకలపై ఆంక్షలు విధించినప్పటికీ... ఎవరూ పట్టించుకోలేదు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో కరోనా వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ కేశినేని సూచించారు. వైరస్ నియంత్రణ కోసం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్లు విడుదల చేస్తానన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసే వెంటనే పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్​లను ఆయన కోరారు. ఇక, క‌రోనాపై క‌ట్ట‌డి చేద్దాం ..అంతా క‌లిసి రావాలి..అంటూ శ్రీకాకుళం పార్లమెంటు స‌భ్యుడు కింజ‌రాపు రామ‌మోహ‌న్‌నాయుడు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌పంచ‌మంతా క‌రోనా పంజాతో విల‌విల్లాడుతున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జాప్ర‌తినిధిగా, శ్రీకాకుళం ఎంపీగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతున్న వైద్య‌స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌కు త‌న‌వంతు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఒక నెల జీతంతోపాటు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 ల‌క్ష‌లు అంద‌జేస్తున్నాన‌ని చెప్పారు.

ఈ నిధులు శ్రీకాకుళం క‌లెక్ట‌ర్‌కి అంద‌జేయ‌నున్నాన‌ని, శ్రీకాకుళం పార్ల‌మెంటు ప‌రిధిలో ఇంకా వైద్య‌ప‌రిక‌రాలకు గానీ, ఏ అవ‌స‌రం వ‌చ్చినా త‌న‌కున్న నిధుల‌న్నీ అంద‌జేస్తాన‌ని తెలిపారు. స్వ‌చ్ఛంద గృహ‌నిర్బంధం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రోజువారీ కూలీలు ఒక్క‌రోజు కూలికెళ్ల‌క‌పోతే భోజ‌నానికి ఇబ్బంది ప‌డే ప‌రిస్థితులున్నాయి. వారికి సాయంగా ఒక నెల జీతం అంద‌జేస్తున్నాన‌ని చెప్పారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో దేశ‌వ్యాప్తంగా రెక్కాడితేగానీ డొక్కాడ‌ని కూలీలను ఆదుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి కూడా ప్ర‌త్యేక నిధి ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నానని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read