రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని అధికారపక్షం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషను పనిచేసిన మాజీల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గవర్నర్‌ను కలిశారు. వీరిలో సీఎస్ నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎస్ఈసీ అంశంపై వారు గవర్నర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా వారు గవర్నరుకు వివరించారు. ముఖ్యంగా ఎస్ఈసీ రాసిన లేఖలోని పలు అంశాలను వారు గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉండి కార్యకలాపాలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయిచండాన్ని అధికార వైసీపీ తీవ్ర పరిణామంగా తీసుకుంటోంది.

అందుకే ఎస్ఈసీ వివాదానికి తెరవేయాలని ఖరాఖండిగా నిర్ణయించింది. ఇందుకోసం రెండుమూడు వ్యూహాలనుసిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిగా ఎస్ఈసీని విధుల నుండి తప్పించేందుకు ఎలా వెళ్లాలనే అంశం పై దృష్టిపెడుతోంది. ఈ నెల 28 నుండి 31 వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఎఈసీని బాధ్యతలనుండి తొలగించేలా తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపాలని యోచన చేస్తోంది. అయితే, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందా..లేదా..అన్నదానిపై సంశయం నెలకొన్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన కార్యక్రమాలపై కూడా దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన లేఖ ఎక్కడి నుండి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ తరపున డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదుచేసి వాస్తవాలను బయటపెట్టాలని కోరింది.

ఇక దీంతో పాటు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ప్రభుత్వం తరపున ఏఏ నిర్ణయాలు తీసుకుంటే ఈ వివాదాన్ని కట్టడి చేయవచ్చనే అంశంపై కూడా దృష్టిపెట్టారు. ఇదే అంశంపై అధికారపక్షం మరోమారు కోర్టును ఆశ్రయించడమా లేక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే మరో అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోను ముగ్గురు కమిషనర్లను నియమించాలని భావిస్తున్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ తెచ్చి, మరో ఇద్దరు కమిషనర్లను, తమకు అనుకూలమైన వారిని నియమించాలని, తద్వారా రమేష్ కుమార్ కు బ్రేక్ వెయ్యచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అయ్యే పనులు కాదని, హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అభిశంసన ద్వారా తప్ప, వేరే విధంగా తప్పించే అవకాశమే లేదని అంటున్నారు. ఇవన్నీ జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని అంటున్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అధికారిక కార్యకలాపాలు అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచే ప్రారంభం కాబోతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. అయితే ఆదివారం ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆకస్మికంగా ఆరు వారాలు వాయిదా వేయడం తాత్కా లికంగా ఊరట కలిగించే విషయం అయినా తరువాత విశాఖ తప్పదన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఉద్యోగులను అలెర్ట్ చేసారు. ఇదిలా ఉండగా మే నెలలో అమరావతిని వీడి విశాఖకు వెళ్లే విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సచివాలయ ఉద్యోగులు వాటి విషయంలో ప్రభుత్వం నుంచి హామీల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఆలోచనలో ఉన్నారు. విశాఖ ప్రతిపాదన చర్చలు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మే నెల తర్వాత విశాఖ వేదికగా పాలన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

దీంతో ఈ లోపే ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎస్ నీలం సాహ్ని పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల డిమాండ్లు ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖ వెళ్ళేందుకు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటిని ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా విశాఖకు మే నెలలో వెళ్లగానే అక్కడ తాత్కాలికంగా అయిన ప్రభుత్వం వసతి సదుపాయాలు కల్పించాలని, అలాగే విశాఖకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలు చెల్లించాలని ఉద్యోగులు ప్రతిపాదన చేశారు. అదే విదంగా తమపిల్లలకు విశాఖలో విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరికేలా ప్రభుత్వం సాయం చేయాలని కూడా ఉద్యోగులు అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నప్పటికి ప్రధానంగా వీటిపైనే ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.

గత వారం భేటీలో నిర్ణయం విశాఖ వెళ్లేందుకు ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్ల పై ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చుస్తున్నారు. కాగా మే నెలలో తరలింపు ప్రారంభించి జూన్ చివరి నాటికి సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ ముందు పెట్టిన డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను కోరింది. దీంతో వారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. త్వరలో వారు ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆకస్మికంగా వాయిదా వేయడం, కరోనా వైరస్ నేపథ్యంలో అమరావతి నుంచి పరిపాలన విశాఖపట్నంకు మార్చే ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క ఈ విషయం కోర్టులో ఉండగా, ప్రభుత్వం కనుక ఇలా దూకుడుగా వెళ్తే, కోర్ట్ లో ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే కోర్ట్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆఫీసులు మార్చితే, ఆ ఖర్చులను అధికారుల నుంచే వసూలు చేస్తాం అని కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

ప్రపంచవ్యాప్తంగా కరోనాధాటికి దేశాలన్నీ కకావికలమవుతుంటే, జగన్మోహన్ రెడ్డి, మంత్రు లు, ప్రభుత్వ సలహాదారులు టీడీపీపై, చంద్రబాబుపై బురదజల్లుతూ, రాజకీయాల చుట్టూ తిరుగుతూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని టీడీపీనేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణతీరు, ప్రభుత్వ వైఖరి, తనకు జరిగిన అవమానంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) కేంద్ర హోంశాఖకు లేఖరాస్తే, దానిపై కూడా ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్మాదంతో రాద్ధాంతం చేశారని నిమ్మల దుయ్యబట్టారు. డీజీపీని అడ్డుపెట్టుకొని, లేఖలోని వివరాలు బయటకు రాకుండా చేయడంకోసం మీడియాను బెదిరిస్తూ, వైసీపీవారు ఇష్టానుసారంగా ప్రవర్తించా రన్నారు. లేఖ ఎస్ ఈసీ ఏ రాశాడని కేంద్ర హోంశాఖ నిర్ధారించిందని, దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ స్పష్టమైన ప్రకటనకూడా చేసిందన్నారు. సదరులేఖ ఎస్ ఈసీ రాయలేద ని, ఆయనతో టీడీపీఏ రాయించిందని, ఎన్నికల కమిషనర్ సంతకాన్ని టీడీపీవారే ఫోర్జరీ చేశారని, పలురకాలుగా దుష్ప్పచారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతలు ఇప్పుడు తమతలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని నిమ్మల నిలదీశారు. ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, హింసాత్మక ఘటనలతో పాటు బెదిరింపుల, ప్రలోభాలతో కూడిన బలవంతపు ఏకగ్రీవాలను కూడా ఈసీ తనలేఖలో ప్రస్తావించాడన్నారు. ఈసీ లేఖ, అందులో పేర్కొన్న అంశాలపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని, టీడీపీవారిపై, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై స్పందించకుండా ప్రజలను మభ్యపెట్టాలని చూసిన జగన్, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని రామానాయుడు ప్రశ్నించారు.

కడపజిల్లాలో 553 ఎంపీటీసీలుంటే, 439స్థానాలు, 50జడ్పీటీసీలకు 38స్థానాలు ఏకగ్రీవమైన విషయాన్ని కూడా ఈసీ తన లేఖలో చెప్పడం జరిగిందన్నారు. ఒక్కరుకూడా ఓటువేయకుండా, ఎన్నికలు జరగకుం డానే, బలవంతపు ఏకగ్రీవాలు జరిగినవైనాన్ని, ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అపహాస్యమైన తీరుని కమిషనర్ తనలేఖలో ప్రస్తావించాడన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అప్రతిష్టపాలు కావడానికి, ఎన్నికల్లో ఘోరాలు జరగడానికి, ముఖ్యమంత్రి చేసిన ప్రకటే కారణమని, స్థానికఎన్నికల్లో 90శాతం గెలిచితీరాలంటూ ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను బెదిరిం చడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఇదే అంశాన్ని ఈసీతనలేఖలో కూడా చెప్పాడని నిమ్మల స్పష్టంచేశారు. తాను ఆదేశించినప్పటికీ, ఎన్నికల్లో ఆకృత్యాలకు పాల్పడిన కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కూడా ఈసీ తనలేఖలో చెప్పడం జరిగిందన్నారు. ఎన్నికలు వాయిదావేశానన్న అక్కసుతో, ముఖ్యమంత్రి తననుకులంపేరుతో దూషించడాన్ని కూడా ఎస్ఈసీ తనలేఖలో ప్రస్తావిం చాడని, ఆయన తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించాడని, సీఎంని ఆదర్శంగా తీసుకొని మంత్రులు, వైసీపీనేతలు, ప్రభుత్వ సలహాదారులు, ఆఖరికి స్పీకర్ కూడా మితిమీరి ప్రవర్తించారని రాజ్యాంగబద్ధమైన పదవిలోఉన్న రమేశ్ కుమార్ లేఖలో వాపోయాడన్నారు.

ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని, నేర స్వభావాన్ని, ఆయన గతచరిత్రను కూడా తన లేఖలో ప్రస్తావించిన ఈసీ, అంతటి ప్రతీకారస్వభావమున్న వ్యక్తి నాయకత్వంలో తాను ఎన్నికలు నిర్వహించలేనని, రాష్ట్రంలో విధులునిర్వర్తించాలంటే తనకు భయంగా ఉందని కూడా ఎస్ ఈసీ వాపోయాడని నిమ్మల తెలిపారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఉండే విధులు నిర్వర్తిస్తాన ని, ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకంలేదని, కేంద్రబలగాలతో తనకు తగిన రక్షణ కల్పించాలని ఎస్ ఈసీ తన లేఖలో విజ్ఞప్తి చేయడంపై, స్పందించిన కేంద్రహోంశాఖ ఆయనకు భద్రత కల్పించిందన్నారు. కేంద్రహోంశాఖ ప్రకటనపై, ఎస్ ఈసీ తన లేఖలో ప్రస్తావించిన అంశాలపై, ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనతప్పు తెలుసుకొని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. లేఖలో పేర్కొన్న అంశాల్లోని తీవ్రతను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలని, ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, కేంద్రబలగాల ఆధ్వర్యంలో తిరిగి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని నిమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ కే రాష్ట్రంలో రక్షణ లేకపోతే, పోటీలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నారు. స్థానిక ఎన్నికల్లో దాడులతో, కేసులతో, అప్రజాస్వామిక వాతావరణం సృష్టించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు, తన తప్పు తెలుసుకొని జగన్, రాష్ట్రప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసీని కులంపేరుతో దూషించినందుకు, ఆయనకు, కమ్మకులానికి కూడా జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనాప్రభావంలేదని, వైరస్ వలన రాష్ట్రానికి ఏవిధమైన ప్రభావంలేదని, రాబోయే 3-4వారాల్లో కరోనా ప్రభావం ఉండదని, సీ.ఎస్ (చీఫ్ సెక్రటరీ) లేఖ రాసిందని, ఆమెతో అలా రాయించినందుకు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరించినందుకు కూడా ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాక మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడకుండా, పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో నయమవుతుందని చెప్పడం దారుణమన్నారు.

ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కూడా ఆయన వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇతరదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చినవారి విషయంలో ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుందో ముఖ్యమంత్రి ఇప్పటివరకు వివరించలేదన్నారు. ముఖ్యమంత్రి బాటలోనే ఆయన కార్యదర్శి పీ.వీ.రమేశ్ నడిచాడని, తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఆయన మాట్లాడుతూ, “కరోనా ఒక సాధారణవ్యాధి అని, 80శాతం వరకు ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చని, విశ్రాంతి తీసుకుంటూ, 650 గ్రాముల పారాసిట్మాల్, ప్రతి 6గంటలకు ఒకసారి తీసుకుంటే, పూర్తిగా నయమవుతుంది” అని చెప్పడం జరిగిందన్నారు. (రమేశ్ మాట్లాడిన వీడియోను ఈసందర్భంగా విలేకరులకు ప్రదర్శిం చారు) పీ.వీ.రమేశ్ చెప్పిన మోతాదుప్రకారం ప్రతిఆరుగంటలకు 650గ్రాముల చొప్పున తీసుకుంటే, ఒక్కోవ్యక్తి, ఒక్కరోజులో రెండున్నరకిలోల పారాసిట్మాల్ తీసుకోవాల్సి ఉంటుం దని, ఆస్థాయిలో తీసుకుంటే, మనిషనేవాడు బతుకుతాడా అని నిమ్మల ప్రశ్నించారు. రోజుకి రెండున్నర కిలోల పారాసిట్మాల్ వేసుకోమని ముఖ్యమంత్రి కార్యదర్శి చెప్పడం చూస్తుంటే, కరోనాపై రాష్ట్రముఖ్యమంత్రికి ఎంత సీరియస్ నెస్ ఉందో, ఆ కార్యదర్శికి కూడా అంతే సీరియస్ నెస్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా మాట్లాడటానికి వారికి సిగ్గు, లజ్జ, బుధ్ధి, జ్ఞానం ఉన్నాయా అని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరకంగా కరోనావిషయంలో కూడా ముఖ్యమంత్రి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని, అందుకు కూడా ఆయన ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఎస్ఈసీ రాసిన లేఖ తప్పుడుదని, ఆయన సంతకం ఫోర్జరీ చేశారని, టీడీపీవారే రాయించారని వైసీపీప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు దుష్ప్రచారం చేశారని, సదరు లేఖపై కేంద్రహోంశాఖ చేసిన స్పష్టమైన ప్రకటన తరువాత వారేం సమాధానం చెబుతారని రామానాయుడు నిలదీశారు. (కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు), రాష్ట్రఎన్నికల కమిషనర్ లేఖ తమకు అందిం దని, దానిపై స్పందించి, ఆయనకు భద్రతకల్పించామని, లేఖలో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ ని ఆదేశించినట్లు కిషన్ రెడ్డిచెప్పాడని, దానిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏం సమాధానం చెబుతారని టీడీపీనేత ప్రశ్నించారు. ఈ విధంగా నీచాతినీచంగా విషప్రచారం చేసినందుకు సిగ్గు, ఎగ్గు, మానం, అభిమానం అనేవి ముఖ్యమంత్రికి ఏమైనా ఉంటే, ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబుకి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లింకుపెట్టి నోటికొచ్చినట్లు బుధ్దిలేకుండా మాట్లాడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు తమతలలు ఎక్కడ పెట్టుకుంటారన్నారు.

ఎన్నికల్లో అప్రజాస్వామికచర్యలకు పాల్పడినందుకు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినందుకు, ఎస్ఈసీకి కులాన్ని ఆపాదించి దూషించినందుకు, కరోనాప్రభావం లేదని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించినందుకు ముఖ్యమంత్రి రాష్ర్టప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని నిమ్మల తేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి నేరస్వభావం, ఫ్యాక్షన్ మనస్తత్వం కారణంగా భయభ్రాంతులకు గురైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన విధులను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నాడని, దాన్ని బట్టే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలంతా గ్రహించాలన్నారు. బీహర్ వంటి రాష్ట్రంలో ఉండే హింసాయుతమైన వాతావరణం రాష్ట్రంలో సృష్టించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలోని అంశాలన్నీ వాస్తవాలైనందున, కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా ప్రభావం తగ్గాక, ఎన్నికలకు సంబంధించి రీనోటిఫికేషన్ఇచ్చి, ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలుజరిపించాలని నిమ్మల పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. అలా జరిగితేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందన్నారు. ప్రజలను కరోనా బారి నుంచి కాపాడేలా ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించాలని నిమ్మల కోరుకున్నారు.

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, వారికే తెలియదు. మధ్యలో పిచ్చోళ్ళు ఎవరు అంటే, వారిని గుడ్డిగా సమర్ధించే వారు, వారిని నమ్మే ప్రజలు. ఈ మధ్య ట్రెండ్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యటం, అదే నిజం అని ప్రజలను నమ్మించటం. ప్రజలు కూడా, అది నిజమా అబద్ధమా, ఏ ఉద్దేశంతో అలా చెప్తున్నారు అనే ఆలోచనా శక్తి కోల్పుతున్నారు. ఇది మన రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫేక్ న్యూస్ నిజం అని నమ్మించి మోసం చెయ్యటం, ఇక్కడ బాగా అలవాటు. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాం అంటూ మొదలు పెట్టారు. అయితే ఎన్నికల కోడ్ ఉంటూ ఉండగానే, ఉగాది రోజున ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తాం అని ప్రచారం చేసారు. ఎన్నికల కోడ్ ఉండగా, ఇలా కొత్త పధకం ఎలా తెస్తారు అంటూ, టిడిపి , విపక్షాలు ప్రశ్నించాయి. అయితే, టిడిపి పేదల ద్రోహి, పేదలకు పండుగ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా, ఆపుతున్నారు, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అంటూ, వైసీపీ కింద స్థాయిలో ప్రచారం చేసింది.

ఇది ఇలా నడుస్తూ ఉండగానే, ఎన్నికల కమీషనర్ రామేశ్ కుమార్, కరోనా ఎక్కువ అవుతూ ఉండటంతో, కరోనా తగ్గే వరకు, ఎన్నికలు వాయిదా వేస్తున్నాం అని, ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుంది అని, పాత పధకాలకు ఇబ్బంది లేదని, కొత్త పధకాలు ఏమైనా పెట్టాలి అంటే, మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. అయితే, దీని పై వైసీపీ గోల గోల చేసింది. చంద్రబాబు కులం, రమేష్ కుమార్ కులం ఒక్కటే అనే, ఇద్దరు కలిసి పేదలకు అన్యాయం చేసారని, ఉగాది రోజున, మేము పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అనుకున్నాం, మొత్తం చెడగొట్టారు అంటూ ప్రచారం చేసారు. ఈ కేసు సుప్రీం కోర్టకు చేరింది. సుప్రీం కోర్ట్ ఎన్నికల కోడ్ ఎత్తి వేస్తూ, కొత్త పధకాలకు ఈసీ పర్మిషన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఇదే సమయంలో, ఈ రోజు ఉదయం, ఉగాది రోజున, ఇళ్ళ స్థలాల పంపిణీ చెయ్యటంలో మాకు అభ్యంతరం లేదు అంటూ, ఎన్నికల సంఘం లేఖ రాసింది. సుప్రీంకోర్టు 437/20 తీర్పును అనుసరించి, ఇళ్ళ స్థలాల పంపిణీ కొనసాగించవచ్చు అంటూ, ఈసీ ఈ రోజు ఉదయం చెప్పింది. అయితే, ఈసీ తమకు అనుకూలంగా రావటంతో, సహజంగా అయితే, వైసీపీ ఎగిరి గంతెయ్యాలి, కాని వైసీపీ, తూచ్ అంది. కోరనా బాగా ఉందని, ఉగాది రోజున మేము, ఇళ్ళ పట్టాలు చెయ్యలేమని, ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్ 14న, ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అంతలా గోల గోల చేసిన వైసీపీ, ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పినా, అమ్మో మాకు కుదరదు, కరోనా ఉంది అని చెప్తూ, ఇప్పుడు వైసీపీ చెప్పింది అంటే, మొన్నటి దాక టిడిపి పై, ఈసీ పై చేసిన ప్రచారం, ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. గోల గోల చేసి, ఇప్పుడు సరే అని పర్మిషన్ ఇస్తే, తూచ్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read