ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాత్ర పై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ నడుం కడుతుందా, రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు వస్తుందా, ప్రజల్లో గూడు కట్టుకున్న అసహనాన్ని తొలగించేందుకు బీజేపీ ముందుకు వస్తుందా అంటూ, ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ల పై, ఇప్పుడు ఏపిలో చర్చా జరుగుతుంది. అయితే ఈ ట్వీట్లు చెయ్యటం వెనుక, ఏ కారణం ఉంది అనేది క్లారిటీ రావటం లేదు. వరుసగా కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పై ప్రభుత్వం దాడి చేస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎవరైనా ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్నికల కమీషనర్ వ్యవహారంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే, ఏకంగా న్యాయవ్యవస్థ పైనే దాడి మొదలైంది.

మరో పక్క సొంత పార్టీ ఎంపీ కూడా, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇస్తే, దాడి జరుగుతుంది. ఆయన ఏకంగా కేంద్రానికి లేఖ రాసి, తనకు సెక్యూరిటీ కావాలని కోరారు. ఇక అమరావతిని మూడు ముక్కలు చెయ్యటం కూడా, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరో పక్క రాజకీయ దాడులు, కక్ష సాధింపు చర్యలు కూడా అధికం అయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇసుక దొరక్క, పనులు లేక, జీవితాలు అస్తవ్యసంగా ఉన్నాయి. అప్పు తెచ్చి, ఉచితాలు పంచి పెట్టటం తప్ప, రాష్ట్రంలో జరుగుతున్నది ఏమి లేదు. ఈ నేపధ్యంలో జంధ్యాల రవి శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎలా వస్తుంది ? ఫెడరల్ వ్యవస్థలో మరో ప్రభుత్వాన్ని శాసించటం సాధ్యమయ్యే పనేనా ? ఏ రూపంలో బీజేపీ వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం, ఇటీవల, న్యాయ వ్యవస్థను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పై, హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. అయితే ఈ పిటీషన్ వేసింది బీజేపీ కావటం గమనార్హం. మీడియాలో ఎక్కువగా కనిపించే, బీజేవైఏం అధ్యక్షుడు రమేష్ నాయుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. వ్యవస్థల పై సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ మాట్లాడారని, రమేష్ నాయుడు అభ్యంతరం తెలిపారు. ఈ నెల రెండవ తేదీన , తిరుమలలో తమ్మినేని మాట్లాడిన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. పరిపాలనలో, పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, ఇలాగైతే మేము ఎందుకు అంటూ తమ్మినేని మాట్లాడిన వ్యాఖ్యలను ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో, మూడు స్థంబాలలలో ఒకటైన న్యాయ వ్యవస్థ పై రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, వ్యవస్థల మధ్య, స్పష్టమైన విభజన రేఖ ఉందని, అలాగే చట్టాలు, వాటి అమలు తీరు విషయంలో, జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగమే, న్యాయ వ్యవస్థకు ఇచ్చిందని పేర్కొన్నారు.

శాసన, ఎక్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలను, సమీక్షించే అధికారం కోర్టులకు ఉన్నాయని అన్నారు. సామాన్యుడికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉండేలా, ఆర్టికల్ 129, 215 ప్రకారం, తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యల పై కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు రాజ్యంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ప్రజలు అయినా, స్పీకర్ అయినా, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే, అవి చక్కదిద్దే హక్కు, రాజ్యాంగం కోర్టులకు కట్టబెట్టిందని అన్నారు. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు ఒక దుష్ట సంప్రదాయానికి, నాంది పలికేలా ఉన్నాయి కాబట్టే, తాను కోర్టు వద్దకు రావాల్సి వచ్చిందని అన్నారు. అయితే బీజేపీ ఈ విషయంలో ఎంటర్ అవ్వటం పై, రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. బీజేపీ ఏపిలో తన ఆట మొదలు పెట్టిందా అనే విషయం పై చర్చ జరుగుతుంది. 108 స్కాం బయట పెట్టిన దగ్గర నుంచి, బీజేపీ రోజు రోజుకీ వైసీపీ పై విమర్శల దాడి పెంచుతుంది.

కుట్ర కోణంలో భాగంగానే మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రపేరును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యకేసులో చేర్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడారు. జూన్ 29న ఉదయం 11 గంటలకు మచిలిపట్నంలో హత్య జరిగితే, 1.15నిమిషాలకు ఎఫ్ ఐఆర్ సిద్ధం చేశారని, కేవలం రెండుగంటల 15 నిమిషాల్లోనే ఏ4 గా రవీంద్ర పేరును చేర్చడం కుట్రకాక, మరేమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, తగురీతిలో విచారణ జరపకుండా, కేవలం కుట్ర కోణంతోనే మాజీ మంత్రి పేరును ప్రభుత్వం ఏ4గా చేర్చిందన్నారు. రెండుకుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా జరిగిన హత్యకేసులో కావాలనే రవీంద్ర పేరు చేర్చారని, ఎఫ్ ఐ ఆర్ లో పేరు చేర్చిన ప్రభుత్వం దాన్ని దాచిపెట్టి ఎందుకు రాజకీయాలు చేసిందని దేవినేని నిగ్గదీశారు. మత్స్యకార వర్గం నుంచి బలమైన వ్యక్తిగా ఎదిగిన కొల్లు రవీంద్ర గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి కేబినెట్ లో 4 శాఖలను సమర్థవంతంగా, నిజాయితీతో నిర్వర్తించి, వివాద రహితుడిగా మంచిపేరు సంపాదించాడన్నారు.

ప్రతిపక్షంలో ఉండి కూడా, తన సమర్థతను చాటుకుంటూ, జగన్ ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్నాడన్న అక్కసుతోనే రవీంద్రపై ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తెలుగుదేశం పాలనలో మచిలీపట్నంలో ఏనాడు హత్యలు జరగలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాకే, రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా హత్య జరిగిందన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, విచారణ జరపకుండా మాజీమంత్రి పేరుని హత్యకేసులో ఎలా చేర్చారో, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. ‍హత్యకేసులో రవీంద్ర పేరును చేరుస్తున్నారన్న వార్తలు కొన్ని ఛానళ్లలో వచ్చాయని, దానిపై తాను, కొనకళ్ల నారాయణ పోలీస్ అధికారులను అడగటం జరిగిందన్నారు. దానికి స్పందించిన పోలీసులు, ఆ వార్తలన్నీ అవాస్తవాలని, ఇంకావిచారణలో ఏమివెల్లడి కాలేదని సమాధానమిచ్చా రన్నారు. ఆనాడు పోలీసులు అలా చెప్తే, తరువాత ఏ4గా రవీంద్ర పేరును ఎలా చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

జూన్ – 29న హత్య జరిగితే, జూలై -02న డిఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారని, ఆనాడు రవీంద్ర ప్రమేయం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, రవీంద్ర ప్రమేయం లేదని, తగిన ఆధారాలు లేవని డీఎస్పీ సమాధానం చెప్పాడని దేవినేని పేర్కొన్నారు. జూన్ 29న ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసి, జూలై 2 నాటి డీఎస్పీ సమావేశంలో రవీంద్ర పేరు లేదని చెప్పడమేంటన్నారు. హత్యకేసు నిందితులకు సంబంధించిన సీసీ.టీవీ పుటేజ్ సోషల్ మీడియాలో వచ్చిందని, దాని కారణంగా అక్కడ పనిచేసిన పోలీసులను వీ.ఆర్ కు పంపారని, ముందేమో సస్పెండ్ అని చెప్పారని, తరువాత వీ.ఆర్ కు పంపారని, ఇవన్నీ ఎందుకు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బడుగు, బలహీన వర్గాలను కుట్రపూరితంగా కేసులో ఇరికించి వారిని ఎందుకు అణగదొక్కాలని చూస్తున్నారో, ఢిఫ్యాక్టో హోం మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. రవీంద్ర పేరులేదని చెప్పిన తరువాత విశాఖ వెళుతున్న వ్యక్తిని బలవంతంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని దేవినేని ప్రశ్నించారు. హత్య జరిగిన నాలుగురోజుల తర్వాత రవీంద్రను అరెస్ట్ చేసి, పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పడం సిగ్గుచేటు కాదా అని దేవినేని మండిపడ్డారు. రవీంద్ర బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడనే ఆయన్ని జగన్, సజ్జల అరెస్ట్ చేయించారని, ఇవేవీ పట్టించుకోకుండా ఒకమంత్రి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం తరుపున సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని దేవినేని ఎద్దేవాచేశారు.

తిరువతి నగరంలో కరోనా బాధిత రోగి మృతదేహాన్ని జేసిబితో ఖననం చేసిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కరోనా వైరస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగి మృతదేహాన్ని మానవత్వంతో కాకుండా విలువలు మరచి పిపిఈ కిట్లు ధరించి జేసిబిని వినియోగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆదివారం జిల్లాలో కరోనా వైరస్ బాధిత రోగుల వివరాల జాబితాలో ఈ మరణ వార్తను అధికారులు తెలియజేయకపోవడం కూడా కొంత విస్మయం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇదే తరహాలో చోటుచేసుకున్న ఘటన మరచిపోకముందే తిరుపతిలోసిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. పలాసలో జరిగిన ఘటన పై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి నగరానికి చెందిన ఆ వ్యక్తి (64)కళాకారుడు. కరోనా వైరస్ బారినపడటంతో కొద్దిరోజుల క్రిందట తిరుపతి రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారంరాత్రి మృతిచెందాడు.

కరోనా రోగి మృతదేహాన్ని అంబులెన్స్ లో సోమవారం ఉదయం తిరుపతి నగరపాలకసంస్థ కార్యాలయం నమీవంలో వున్న హరిశ్చంద్ర శ్మశానవాటిక వద్దకు తరలించారు. అప్ప టికే శ్మశానవాటికలో అధికారులు తవ్వించిన గోతిలో జెసిబి బకెట్లోకి ఎక్కించి మృతదేహాన్ని గోతిలో పడేసి అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని గంటల్లోనే ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే మృతుని బరువు కారణంగానే జెసిబితో ఖననం చేసామని కమిషనర్ సెహ్ప్పారు. కరోనా వైరస్ తో మృతి చెందిన రోగి మృతదేహాం బరువు 160 కిలోలు ఉండటంతోనే జెసిబితో ఖననం చేయాల్సి వచ్చిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పిఎస్ గిరీషా వివరణ ఇచ్చారు. జేసిబితో కరోనా మృతదేహం ఖననం సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ గా మారడంతో సోమవారం సాయంత్రం 6గంటలకు అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ తో మృతిచెందిన వృద్ధుని బరువు అత్యధికంగా వుండటంతోనే పారిశుధ్య సిబ్బంది జెసిబితో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేగాక మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్య లు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read