సుప్రీం కోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ పిటిషన్‌ను జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం విచారించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ను సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ సుప్రీంను ఆశ్రయించింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా లోపలికి వెళ్లేందుకు ఎల్‌జీ పాలిమర్స్‌ అనుమతి కోరింది. ఏడు కమిటీల్లో దేనికి హాజరు కావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్‌జీ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాని హైకోర్టు, వీటి పై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్‌ని సందర్శించేందుకు సుప్రీంకోర్టు ఎల్జీ పాలిమర్స్‌కు అవకాశం ఇచ్చింది. 30 మంది కంపెనీ నిపుణుల పేర్లను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

తొలి పిటిషన్‌తో కలిపి వాదనలు జూన్‌ 8 వ తేదీన వింటామని, అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. పోయిన శుక్రవారం, ఎల్జీ పాలిమర్స్ విషయంలో, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్టేరైన్ ను ఎవరు తరలించమన్నారు ? ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. అలాగే లాక్ డౌన్ తరువాత ఎవరు పర్మిషన్ ఇచ్చారు, కంపెనీ డైరెక్టర్ లో లోపల ఎందుకు తిరుగుతున్నారు, కంపెనీని సీజ్ చెయ్యండి, విచారణ సంస్థలు మాత్రమే లోపలకు వెళ్ళాలి, వాళ్ళు కూడా, రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి అని హైకోర్ట్ ఆదేశించింది. అయితే దీని పై సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన ఎల్జీ పాలిమర్స్ కు, రిలీఫ్ లభించలేదు, కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

గత కొన్ని రోజులుగా, హైకోర్ట్ జడ్జిల పై, ఇష్టం వచ్చినట్టు, వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు, వైసీపీ ఎంపీ, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయగా, న్యాయస్థానం స్పందించింది. సోషల్ మీడియాలోని పోస్టులను, నేతల వీడియో క్లిప్పింగ్​లను పరిశీలించింది. ఇవన్నీ పరిశీలించిన కోర్ట్, సుమోటోగా విచారణకు తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది. దీనికి సంబంధించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బాపట్ల ఎంపీ సురేశ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, వైసీపీ నాయకుడు రవిచంద్ర రెడ్డి కూడా ఉన్నారు.

జడ్జిలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారని న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో అన్నారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ పై పోస్టులు చాలా అసభ్యకరంగా ఉన్నాయని, కోర్టులను రాజకీయాలకు వేదిక చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ ఘటనలో కోర్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక అనేకమంది నేతలు, ఎంపీలూ ఉన్నారని లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టును భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. దోఘలైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ రామారావు అభిప్రాయపడ్డారు.

న్యాయస్థానాలకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని మాజీ న్యాయమూర్తి జస్టిస్​ చంద్రకుమార్​ అన్నారు. కావాలంటే కోర్టు తీర్పులపై పైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ప్రతి తీర్పుపైనా అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆయన.. న్యాయమూర్తులపై కామెంట్స్​ చేయడం సరికాదని హితవు పలికారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. కోర్టు తీర్పును విమర్శించే హక్కు పౌరులకు ఉందని అన్నారు.

విశాఖపట్నంలోని, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్న, డాక్టర్ సుధాకర్ మాస్కు అడగటం, తరువాత మీడియా ముందు మాస్కులు ఇవ్వటం లేదు, డాక్టర్లు మాస్కులు లేవు కాని, నాయకులకు మాస్కులు ఉంటున్నాయి అంటూ, మీడియా ముందు గోడు చెప్పుకోవటంతో, డాక్టర్ సుధాకర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, ఆయన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన కొడుకు పై కేసు పెట్టటం, ఆ గొడవ మర్చిపోక ముందే, డాక్టర్ సుధాకర్ ని చొక్కా లేకుండా రోడ్డు మీద చేతులు కట్టేసి, కొట్టి, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళటం, తరువాత ఆయనకు మెంటల్ అని చెప్పి, మెంటల్ హాస్పిటల్ లో పెట్టటం తెలిసిందే. తరువాత ఈ కేసు హైకోర్ట్ దగ్గరకు వెళ్ళటం, అలాగే హైకోర్ట్ ఈ కేసు పై ప్రభుత్వం చెప్తున్న వాదన, అలాగే న్యాయవాది ఇచ్చిన రిపోర్ట్ లో తేడా ఉండటంతో, అలాగే విశాఖ పోలీసులు పైనే అబియోగాలు ఉండటంతో, ఈ కేసు విచారణను, సిబిఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ ఘటన పై అటు ప్రభుత్వం, అలాగే విశాఖ పోలీసులు కూడా ఏమి జరుగుతుందా అని చూస్తూ ఉండగా, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కు మెంటల్ అంటూ చెప్పిన డాక్టర్లకు కూడా టెన్షన్ మొదలైంది. సిబిఐ ఎంటర్ అయితే, కొన్ని ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలి అనే దాని పై, కొంత మంది వైద్యులు టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. సుధాకర్ ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అక్కడ నుంచి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళిన కొద్ది సేపటికే, ఆయనకు పిచ్చి అంటూ, డాక్టర్లు చెప్పినట్టు, వార్తలు వచ్చాయి. ఒక నోట్ కూడా మీడియాలో తిరిగింది. అయితే, కొద్ది సేపటికే, ఎలా ఆయనకు పిచ్చి ఉంది అని నిర్ధారించారు అనేది ఆశ్చర్యంగా ఉంది.

మెంటల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళిన కొద్ది సేపటికే, ఎలా వైద్యులు నిర్ధారించారు అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి కేసుల్లో, హాస్పిటల్ లో చేర్చుకోవాలి అంటే, మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌-2017 ప్రకారం మేజిస్ర్టేట్‌ రిసెప్షన్‌ ఆర్డర్‌ తీసుకువాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా మానసిక వ్యాధి ఉంటే, అది నిర్దారించటానికి 48 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో తేల్చాలి. ఆ తరువాత మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి, సమస్య ఉందని నిర్ధారించాలి. అయితే డాక్టర్ సుధాకర్ విషయంలో, ఇవేమీ పాటించుకుండా, కేవలం గంటల్లోనే చెప్పేశారు. అయితే ఇది డాక్టర్లు ఎందుకు చేసారు, ఎవరైనా ఒత్తిడి చేసారా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సిబిఐ అడిగే అవకాసం ఉండటంతో, మొత్తం వ్యవహారం ఇప్పుడు సస్పెన్స్ లో పడింది.

అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడులు, అలాగే దేశం నలు వైపులు నుంచి వస్తున్న నిరసన నేపధ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన భూములు అమ్మకాన్ని నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ, జీవో 888 జారీ అయ్యింది. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని, అందరితో చర్చించి, అభిప్రాయం తీసుకునే దాకా, సంప్రదింపులు పూర్తయ్యే దాకా, భూములు వేలం నిలిపివేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి, ఎవరి మాటా వినని ప్రభుత్వం, ఈ విషయంలో మాత్రం, వెనక్కు తగ్గింది. గత రెండు రోజులుగా తిరుమల పై వివాదం రేగింది. తిరుమలేశునికి భక్తులు కానుకలుగా, విరాళాల రూపంలో ఇచ్చిన ఆస్తులను తిరుమల తిరుపతి దేవ స్థానం అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది.

లక్షలాది మంది భక్తులు ఆపదమొక్కులవాడుగా, అనాధరక్షకుడుగా భావిస్తూ శ్రీనివాసుడికి మొక్కుబడులరూపంలో తమ పేరు స్థిరస్థాయిగా నిలిచి పోతుందని భావించి రాసిచ్చిన స్థిరాస్తులు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై దాత భక్తుల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకున్నా శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలేశునికి దేశవ్యాప్తంగా అనేక చోట్ల భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆస్తులు వేలకోట్లా రూపాయలు విలువచేసేవి వున్నాయి. ఈ ఆస్తులను పరిరక్షించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొంత నిర్ల క్ష్యం చూపుతోందనే విమర్శలు భక్తుల్లో లేకపోలేదు. ఇలువేల్పు, ఇష దైవం శ్రీనివాసుడికి ఎంతో మంది భక్తులు తమకు చెందిన ఆస్తులను, భూములను స్వామివారికి అప్పగిస్తే తమ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తారు.

అంతటి భక్తి ప్రాధాన్యతతో దాతలు ఇచ్చిన ఆస్తులను తమిళనాడు రాష్ట్రంలో వున్నవాటిని నిరర్థక ఆస్తులుగా టిటిడి పరిగణించి ఏకంగా విక్రయాలకు నోటిఫికేషన్ ఇవ్వడం తిరుమల, తిరుపతిలోనేగాక రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో పెద్ద దుమారం రేపుతోంది. లక్షలు, వేలకోట్ల రూపాయలు విలువచేసే స్వామివారి ఆస్తులను ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండలి తమ అనుచరులకు, అనుయాయులకు కట్టబెట్టేందుకు బహిరంగ టెండర్లు పేరుతో అనుమతి ఇస్తున్నదంటూ అటు తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఇటు శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకన్న ఆస్తుల అమ్మకాలను - రద్దుచేయకుంటే పెద్దఎత్తున నిరసనలు చేపట్టేందుకు భక్తులు సిద్ధమవు తున్నారు. అయితే ఈ లోపే, ప్రభుత్వం, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

Advertisements

Latest Articles

Most Read