కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల సగం జీతం మాత్రమే చెల్లించనుంది ప్రభుత్వం. మిగిలిన సగం నిదులు సర్దుబాటు అయ్యాక చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైనా ప్రభావం చూపింది. మార్చి నెల జీతాన్ని రెండు విడతల్లో చెల్లించే ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 1న ఉద్యోగులకు చెల్లించే జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు.... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఉద్యోగుల సంఘం అంగీకరించిందని తెలిపారు.

ఇక మరో పక్క, కరోనా వ్యాధి తీవ్రత పెరుగుతుంటే ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టడం తగదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. నాలుగున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ నిత్యావసరాలను ఇళ్లకు పంపిణీ చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం సహా అక్రమ మద్యం నివారణ, వివిధ వర్గాలకు ఆర్థికసాయం వంటి అంశాలపై నాలుగు పేజీల లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా అనేక రంగాలు ఆర్థికంగా చితికిపోతున్నందున ప్రతి కుటుంబానికి తక్షణమే ఐదు వేల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు, నష్టపోతున్న ఉద్యానపంటలు, ఆక్వా, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని కోరారు.

రాష్ట్రంలో అనధికార మద్యం విక్రయాలు కలవరపెడుతున్నాయని, వాటిని తక్షణమే నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా నిర్వహిస్తోందన్న చంద్రబాబు, కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈనెల 17వ తేదీన నిజాముద్దీన్ నుంచి దాదాపు 700మంది రాష్ట్రానికి వచ్చినందున, వారందరికీ తక్షణమే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న రాత్రి 9 గంటలనుంచి ఉదయం 9 గంటల వరకూ 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దిల్లీ వెళ్లి వచ్చినవారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 164 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 147మందికి నెగెటివ్‌, 17 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకూ ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 17 కేసుల్లో 12 మంది దిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లుగా తేలింది. వారితోపాటు వారి బంధువులకు కూడా కరోనా పాజిటివ్‌గా నమోదైంది. ఇందులో 10ఏళ్ల బాలుడి నుంచి అన్ని వయస్సుల వారికీ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అనంతపురంలోని లేపాక్షి, ప్రకాశం జిల్లా చీరాల, కారంపూడి, గుంటూరుటౌన్‌, కుంకలమర్రు, కందుకూరుల్లో కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా చీరాలలో కేసులు నమోదు అయ్యాయి. దిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో అత్యధికంగా ప్రకాశం, గుంటూరు నుంచి ఉన్నట్లుగా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరులో ఒకటి, తూర్పుగోదావరిలో నాలుగు, గుంటూరులో తొమ్మిది, కృష్ణాజిల్లాలో ఐదు, కర్నూలులో ఒకటి, నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ చికిత్స పొంది ఇద్దరు వ్యక్తులు రికవరీ అయినట్లుగా వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరు, విశాఖలో రికవరీ అయి డిశ్చార్జి చేసినా... వైద్యుల పర్యవేక్షణలోనే వారిని ఉంచినట్లు ప్రకటించింది.

దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనకు, రాష్ట్రవ్యాప్తంగా 711మంది హాజరైనట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 122మందిని వేర్వేరు ఆసుపత్రుల్లో క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే 207మందిని ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించింది. 297మంది స్వగృహాల్లోనే క్వారంటైన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 85మందికి సమాచారం తెలియరావడం లేద, వీరు దిల్లీనుంచి నేరుగా తిరిగి వచ్చారా లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై ప్రస్తుతం పోలీసు శాఖ ఆరా తీస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.

గుంటూరు జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారి పై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్ ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నమోదైన 4 కరోనా కేసుల దృష్ట్యా... గుంటూరు జోన్​ను హాట్​ స్పాట్​గా ప్రకటిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైరస్ వ్యాప్తిని నియత్రించేందుకు అధికార యంత్రాంగం నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 4 కేసులు నమోదు కావటం దురదృష్టకరమన్న మంత్రి.. జిల్లా వ్యాప్తంగా 88 ఆస్పత్రులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆ ఆస్పత్రుల్లో 9,352 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రేషన్ సరఫరా 15 రోజులపాటు సాగుతుందని .. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిత్యావసరాల ధరలు పెంచితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తులో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేయాలని కోరింది. చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు 'చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్ ఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌' పేరున పంపాలని సూచించింది. ఆన్‌లైన్‌లో పంపదలచినవారు ఎస్​బీఐ అకౌంట్‌ నంబర్‌ 38588079208, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ SBIN0018884 కు పంపవచ్చని తెలిపింది. ఆంధ్రా బ్యాంకు అకౌంట్‌ నెంబరు... 110310100029039, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ ANDB0003079 కు పంపవచ్చని పేర్కొంది. వెబ్​సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా వివరాలు పంపదలచినవారు apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.

రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సకు వినియోగించుకునే హక్కులు వచ్చేలా, ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ఆదేశాలు వెలువరించింది. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లోని గదులు, వెంటిలేటర్లు, ప్రయోగశాలలు, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సేవల వినియోగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య నిపుణుల సేవలను అవసరమైన చోట తక్షణం వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా నివారణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. వైద్య పరమైన అంశాల్లో మరిని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం వినియోగిస్తామని అన్నారు. ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని... క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షక ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ సామర్థ్యంతో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

క్షేత్రస్థాయిలోని బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు చెప్పారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపుతామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. జిల్లా జేసీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. విక్రేతలు బోర్డుల్లో ధరలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి పింఛను మొత్తాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. వృద్ధులు, అనాథ, శిశు ఆలయాల్లో ఉచిత బియ్యం, కందిపప్పు అందిస్తామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read