కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తులు పూర్తిగా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకునట్టు ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించి భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా దేశం యావత్ తగిన సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని, ఇదే సమయంలో ఒంటరిగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమకున్న అనుభవంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రార్ధనల పేరిట సమావేశాల నిర్వహణకు దూరంగా ఉండేందుక సమతపెద్దలు ప్రజల్లో అవగాహన కలిపించాలన్నారు. వ్యాధి నియంత్రణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ట్రేస్, ఐసోలేట్ అండ్ టీ అనే మంత్రం అన్ని రాష్ట్రాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, వలస కూలీలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వివిధ సంస్థలు, ప్రైవేటు రంగం సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ తదుపరి రాజ్ భవన్ నుంచి జారీ చేసిన ప్రకటనలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్చంధ సంస్థల పాత్రను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ పేర్కొన్నారు. యాచకులు, నిరాశ్రయులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం తగిన సహాయం అందించాలన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో అనుభవాలను పంచుకోవడం ఉపయోగంగా ఉందన్నారు. ఈ తరహా సమావేశాల వలన అందరి అనుభవాలను క్రోడీకరించి మెరుగైన సాయం అందించేందుకు సహకరిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

విశాఖలో కరోనా బాధితుల సంఖ్య 4కు పెరిగింది. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువుకే తాజాగా వైరస్‌ సోకినట్లు తేల్చారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారినిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 112 అనుమానితులకు పరీక్షలు చేయగా 4 గురికి పాజిటివ్.. 96 మందికి నెగటివ్ వచ్చింది. మరో 12 మంది ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. విమ్స్ ను కోవిడ్ -19ఆస్పత్రిగా మార్చి తూర్పుగోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య కళాశాల ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే 3 వేల 500 క్వారంటైన్ పడకలు సిద్ధం చేశారు. వేరే రాష్ట్రాలనుంచి రాష్ట్ర వాసులు వస్తే నిర్బంధ కేంద్రాన్ని వేపగుంటలో సిద్ధం చేశారు.

విశాఖకు 2 వేల 795 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. జీవీఎంసీ పరిధిలో 2 వేల 224 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 571 మంది ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధార, అల్లిపురం, గాజువాక, అనకాపల్లి గ్రామీణ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. 97 బృందాలు నిరంతరం పనిచేసి... అనుమానితులను పరీక్షలకు తరలించే పని చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా పెట్టారు. 21 మందితో జిల్లా కమిటీ వివిధ చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని కరోనా కేసుల పరీక్షలకోసం నిర్దేశించిన ఛాతీ ఆసుపత్రిలో సౌకర్యాల లేమిపై ఒక వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియోపై స్పందించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌... లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిని హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించినందున... విశాఖలో కరోనా పరీక్షా కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖలో ఐసోలేషన్ వార్డులను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలన్నారు. కనీసం ఒక వైద్య బృందాన్ని ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్తు బిల్లులు, మున్సిపల్​ పన్నులు, నీటి బిల్లులు రద్దు చేయాలని సీఎంని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరింది. ఈమేరకు లేఖ రాసింది.

పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగాలేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎన్‌వోసీ తీసుకుని సమస్య పరిష్కరించాలని భాజపా నేత గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగా లేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్వారంటైన్‌కు వెళ్లే అవసరం లేదంటే వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. వారిని హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబుతో కమిటీ ఏర్పాటు కానుంది. నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు వివరించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రివర్గం అభిప్రాయపడింది. దేశానికి, రాష్ట్రాలకూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

కరోనా నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం జగన్‌ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిపైనా మంత్రివర్గం చర్చించింది. వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా రాష్ట్రాలు ముందుకురాకుంటే వసతి ఖర్చు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాచకులు, అనాథలకు వసతి కల్పించాలని, కల్యాణమండపాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు, జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించారు మేఘా కృష్ణారెడ్డి. దేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ మెఘా ఇంజనీరింగ్ కరోనా సాయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది అంటూ, చెప్పుకొచ్చారు. గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఐదు కోట్ల రూపాయల విరాళం అందించిన మెఘా ఇంజనీరింగ్ ఎండీ కృష్ణారెడ్డి..శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలసి సీఎం సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇతర పారిశ్రామిక సంస్థలతో పోలిస్తే కరోనా పోరుకు విరాళం అందించిన వాటిలో మెఘా సాయం ప్రశంసనీయం. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎక్కడ వారు అక్కడే లాక్ డౌన్ ఉంది కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి..ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో నానా కష్టాలు పడుతున్న ఏపీ యువత సరిహద్దులకు చేరుకుని ఇబ్బందులు పడుతోంది. ఇఫ్పటికీ కొన్ని చోట్ల యువత సరిహద్దుల వద్ద నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది మంత్రులు మాత్రం ఎవరైనా ఏపీకి చెందిన వారైనా రాష్ట్రంలోకి రావాలంటే మాత్రం 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని..అందుకు సిద్ధం అయితే మాత్రం రావాలని సూచించారు. అంతే కాదు..పదుల సంఖ్యలో విద్యార్ధులను క్వారంటైన్ లో పెట్టారు కూడా. ఏపీ సరిహద్దులకు చేరిన విద్యార్ధులు, ఉద్యోగులు మా రాష్ట్రంలోకి మమ్మల్ని రానివ్వరా? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ తరుణంలో అన్ని మార్గాలు బంద్ ఉన్న తరుణంలో మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి విజయవాడ వెళ్ళటం, జగన్ కు ఐదు కోట్ల రూపాయల చెక్కు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అసలు మెగా కృష్ణారెడ్డి ఆకాశమార్గంలో విజయవాడ వెళ్ళారా?. రోడ్డు మార్గంలో వెళ్లారా?. ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారా? ఓ వైపు విద్యార్ధులను సరిహద్దుల్లో ఆపేసి విరాళం ఇస్తున్నారు కారణంతో బడా పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలోకి అనుమతించటం సరైన విధానం కాదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిజంగా విరాళం ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో కూడా ట్రాన్స్ ఫర్ చేయవచ్చని..ప్రజలకు ఓ రూల్..పారిశ్రామికవేత్తలకు ఓ రూల్ అనేది సరైన సందేశం పంపదని వ్యాఖ్యానించారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం మెఘా కృష్ణారెడ్డిని ఏపీలోకి అనుమతించటం నిబంధనల ఉల్లంఘనే అని చెబుతున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read