దేశ వ్యాప్తంగా, కరోనా ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్న కేంద్రం, ఆ జాబితాలో మన రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంను చేర్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా, 29 హాట్ స్పాట్లను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రోజు రోజుకీ ఈ వైరస్ పెరుగుతూ ఉండటం, పోజిటివ్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండటంతో, ఈ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను ఈ రోజు గుర్తించింది. ఈ కొత్త జాబితాలో, కరోనా హాట్ స్పాట్ గా, విశాఖపట్నం చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖను హాట్ స్పాట్ జాబితాలో చేర్చిన విషయాన్ని, ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ తెలిపినట్టు, కధనం వచ్చింది. ఈ రోజు ఇచ్చిన జాబితాలో, విశాఖతో పాటుగా బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఢిల్లీలోని న్యూఢిల్లీ, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ కూడా కొత్తగా కరోనా హాట్ స్పాట్ లు గా చేరాయి. మరో పక్క, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా, వైజాగ్ లో ని కొన్ని చోట్ల, రెడ్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. వైద్య నిపుణులను 24 గంటలు అందుబాటులో ఉంచే పని ఒకవైపు... మరో వైపు లాక్ డౌన్ అమలు వల్ల ఎక్కడా నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. క్వారంటైన్, ఐసొలేషన్ వార్డుల ఏర్పాటులో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు అనుమానితులను పరిశీలిస్తున్నాయి. కరోనా తాజాగా నిర్ధారణ అయిన మూడు కేసులు తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇది ఇలా ఉంటే, విశాఖపట్నం రెండో సర్కిల్ పరిధిలోని కొన్ని పౌర సరఫరా డిపోల్లో కందిపప్పు లేదని డీలర్లు చేతులెత్తేయడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ నుంచి కందిపప్పు సరఫరాలో ఆలస్యం జరిగిందని.. సోమవారం నాటికి అన్ని డిపోల్లోనూ సరఫరా చేస్తామని పౌర సరఫరాల సహాయ సరఫరా అధికారి ఎమ్.వి.ప్రసాద్ తెలిపారు.

మరో పక్క, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో 26 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటల వరకు 180 కేసుల నమోదవగా అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో 10 పాజిటివ్​ కేసులను నిర్ధరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 190కి చేరింది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో, 15 పోజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో, కూడా 15 పోజిటివ్ కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 19 పోజిటివ్ కేసులు వచ్చాయి. కడపలో 23 పోజిటివ్ కేసులు, గుంటూరులో 26 పాజిటివ్ కేసులు వచ్చాయి.

మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి. ప్రతిపక్షం అయినా, అధికార పక్షం అయినా. కాని మన దగ్గర వాతవరణం వేరు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ఏ పని చేసినా, జగన్ పార్టీ ఎగతాళి చేసేది. దోమల పై దండయాత్ర అంటే నవ్వారు. దోమల నివారణకు, మురికి కాలవల దగ్గరికి, కాలువల దగ్గరికి వెళ్ళలేని చోట, డ్రోన్ ల సహాయంతో, దోమల మందు చల్లుతాం అంటే, వెటకారం చేసారు. అలాగే వైజాగ్ లో, అని వైద్య పరికరాలు తయారు చేసే, మెడ్ టెక్ జోన్ పెడతాం అంటే ఎగతాళి చేసారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అది మంచి పని అయినా, రాజకీయం కోసం, అప్పట్లో అలా చేసి ఉండొచ్చు. కాని, జగన్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆయన తరుచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు ఆయనకు వర్తిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు కరోనా వ్యాప్తి అరికట్టటానికి, డ్రోన్ల సహయం తీసుకుని, డ్రోన్లతో మందు కొడుతున్నారు. అలాగే ఏ మెడ్ టెక్ జోన్ అయితే మయసభ అన్నారో, ఇప్పుడు అక్కడే, యుద్ధ ప్రాతిపదికిన, మాస్కులు, వెంటిలేటర్లు తయారు చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఏమి తప్పు లేదు. ఇలాంటి సమయాల్లో, టెక్నాలజీ ఉపయోగించాలి.

కాని, అనవసరంగా రాజకీయ విమర్శలు చేస్తే, ఆ దేవుడి స్క్రిప్ట్ మన మీదే రివర్స్ అవుతుంది. ఇక ప్రసుత్తం జగన్ గారి ప్రభుత్వం, డ్రోన్ల సహాయంతో, కరోనా పై ఎలా పోరాడుతుందో చూద్దాం. డ్రోన్ల టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ పై సమరానికి వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కరోనా మహమ్మారి పై డ్రోన్లతో యుద్ధం ప్రారంభించాయి. సాధారణంగా నిఘా కోసం ఉపయోగించే డ్రోన్లను ఇప్పుడు రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా వైరసను కట్టడికి వినియోగించడం మొదలు పెట్టాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు స్ప్రే చేస్తున్నాయి. రసాయనాలను స్ప్రే చేస్తున్నట్లు స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

వీటి కోసం అధికారులు అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వాటి ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాన్కులు, బాడీ సూట్స్ వేసుకుని పారిశుధ్య సిబ్బంది రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. అయితే వీరు ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ఈవిధంగా ఇప్పటికే పలు దేశాల్లో పారిశుధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకుతోంది. ఇందు కోసం కరోనా ప్రభావిత ప్రాంతాలను డ్రోన్ల ద్వారా శుద్ధి చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించాయి. ఒక వ్యక్తి చేసే పనికి 50 రెట్ల పనిని ఈ డ్రోన్లు చేయగలుగుతాయి. 20 కిలో మీటర్ల ప్రాంతంలో ఒక రోజులో చేసే వీలుంటుంది. నిఘా కెమెరాలను పెట్టి ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎక్కడా లేని వింత పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు, స్కూల్స్, పంచాయతీ ఆఫీసులు అంటే, ఆ ఊరిలో ప్రజలందరూ, అక్కడకు వెళ్లి పనులు చేసుకుంటారు. అంతే కాని, ఏదో ఒక పార్టీ వారే అక్కడకు వెళ్లారు. అయితే, 2019 జూన్ లో , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు, వైసీపీ జెండా రంగులు పోలిన, రంగులు వెయ్యాలి అంటూ, ఆదేశాలు వచ్చాయి. ఇక ఆదేశాలు వచ్చిందే తరువు, ప్రభుత్వాధినేతల ద్రుష్టిలో పడటానీకో, లేక నిజంగానే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందో కాని, ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం, వైసీపీ రంగులతో నింపటం మొదలు పెట్టారు. పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగులు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, వాటర్ ట్యాంకులకు వైసీపీ రంగులు, ప్రభుత్వ స్కూల్స్ కి వైసీపీ రంగులు, ఆకులకు వైసీపీ రంగులు, కరంటు స్థంబాలకు వైసీపీ రంగులు, గేద కొమ్ములకు వైసీపీ రంగులు, ఇలా కనిపించిన ప్రతి దానికి, వైసీపీ రంగులతో మొత్తం నింపేశారు.

చివరకు ఒక చోట, జాతీయ జెండా రంగులు కూడా మార్చేసి, వైసీపీ రంగులు పుసేసారు. సహజంగా, ఇవి చూస్తే ఎవరికైనా విరక్తి పుడుతుంది. ఇలా విరక్తి పుట్టే, ఒకరు హైకోర్ట్ కు వెళ్లారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, 1300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ రంగులు వేసారని ఆరోపించింది. అయితే ఈ విషయం హైకోర్ట్ కు చేరటంతో, హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో, అది వైసీపీ రంగు కాదని, ప్రభుత్వ తరుపు లాయర్ చెప్పటంతో, వైసీపీ జెండా కోర్ట్ కు తీసుకురండి, అని కూడా చెప్పింది. ఆ రంగులు ఏంటి, ప్రభుత్వ భవనాల ముందు, ఆ ఫోటో ఏమిటి, మేము కూడా సుప్రీం కోర్ట్ బయట, చీఫ్ జస్టిస్ ఫోటో పెట్టుకోమా అంటూ, ప్రశ్నించింది. చివరకు, హైకోర్ట్ తీవ్రంగా స్పందిస్తూ, 10 రోజుల్లోగా, రాష్ట్రంలో రంగులు అన్నీ మార్చాలని ఆదేశించింది.

బాధ్యతను చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పింది. అయితే, అనూహ్యంగా, ప్రభుత్వం ఈ విషయం పై కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. సహజంగానే, సుప్రీం కోర్ట్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. దీంతో, ఇక చేసేది లేక, ఇప్పుడు ప్రభుత్వం, మళ్ళీ రంగుల పంచాయతీ మొదలు పెట్టింది. హైకోర్ట్ చెప్పినట్టు, రంగుల మార్చాలి కాబట్టి, ఏ రంగులు వెయ్యాలి అనే విషయం పై, ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారం రోజులల్లో, ఏ రంగులు వెయ్యాలో, నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వానికి సూచించాలని వారిని కోరింది. ఈ కమిటీలో భూపరిపాలనాశాఖ కమిషనర్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శిని సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రంగుల పంచాయతీ మొదలు కావటంతో, మళ్ళీ ఎన్ని వందల కోట్లు నష్టపోతామా అని, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రమవుతోన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులన్నింటిని ఎస్మా (ఎసెన్షియల్ సర్వీస్ మెయిన్టనెన్స్ ఆక్ట్ -1977) పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. దీని ప్రకారం ప్రజలకు వైద్యసేవలు, ఇతర సదుపాయాలు అందించేందుకు నిరాకరించినా, పనిచేయటానికి ఆసక్తి కనబర్చకపోయినా వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆరు నెలల పాటు ఈ చట్టం రాష్ట్రం అమలులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని వైద్యసేవలు, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది (మెడికల్), మందుల కొనుగోలు, నిర్వ హణ, రవాణా, అమ్మకం, మందుల తయారీ, ఆంబులెన్స సర్వీసులు, మంచినీరు, విద్యుత్ సరఫరా, రక్షణ-భద్రతపరమైన అంశాలు, ఆహారం, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ సేవలన్నీ శుక్రవారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది.

అయితే ఇది ఇలా ఉంటే, కొంత మంది డాక్టర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు స్వాగిస్తూనే, తాము ప్రజలకు సేవ చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటామని, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే నడుచుకుంటామని అంటున్నారు. అయితే ఇదే సందర్భంలో, కనీసం సేఫ్టీ కిట్లు, మాస్కులు, లాంటివి, విరివిగా సప్లై చెయ్యాలని, అలాగే తమ పై దాడులు జరగకుండా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అంటున్నారు. మరో పక్క, ఇదే విషయం పై, పతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఆయుధం లేకుండా, యుద్ధం చెయ్యమంటారా అంటూ, పవన్ కళ్యాణ్, డాక్టర్లకు కిట్లు లేకపోవటం పై ప్రశ్నించారు. అలాగే, ఈ డాక్టర్లుకి కూడా కావాల్సిన మాస్కులు, ప్రొటెక్షన్ కిట్ లు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రజల్ని ఆర్థిక సాయం అడుగుతున్నారు అంటే, ఎంత దౌర్భాగ్యమో అంటూ, తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ విమర్శలు నడుమ, ప్రభుత్వం, వైద్య సిబ్బంది పై, ఎస్మా ప్రయోగించింది.

ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 23కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 4కు చేరాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైంది.

Advertisements

Latest Articles

Most Read