జగన్ మోహన్ రెడ్డి అక్రమఆస్తుల కేసుల పై, ఈ రోజు తెలంగాణా హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి తన అక్రమఆస్తుల కేసులో, ప్రతి శుక్రవారం మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, తెలంగాణా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. వారం వారం కోర్ట్ కు విచారణకు హాజరు కావటం ఇబ్బంది అని, తనకు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో పనులు ఉన్నాయని, జగన్ మోహన్ రెడ్డి తెలంగాణా హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. తన బదులు, తన న్యాయవాది అశోక్ రెడ్డి హాజరు అవుతారని పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై, గత వారం విచారణ జరగగా, హైకోర్ట్ సిబిఐకు కౌంటర్ దాఖలు చెయ్యమని, కోరింది. పోయిన వారం కేసును వాయిదా వేసింది. ఈ రోజు విచారణలో భాగంగా, సిబిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో, జగన్ మోహన్ రెడ్డి అభ్యర్ధనను సిబిఐ తోసిపోచ్చింది. జగన్ అభ్యర్ధనకు, సిబిఐ తీవ్ర అభ్యంతరం చెప్పింది. అభ్యంతరం చెప్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ మోహన్ రెడ్డికి, మినహాయింపు ఇవ్వద్దు అంటూ, సిబిఐ తన కౌంటర్ లో పేర్కొంది.

సిబిఐ కౌంటర్ దాఖలు చెయ్యటంతో, ఈ కేసు పై తదుపరి విచారణను, హైకోర్ట్, ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్ట్ లో ఒకసారి, సిబిఐ కోర్ట్ లో రెండు సార్లు, జగన్ పెట్టుకున్న వ్యక్తిగత మినహాయింపు పిటీషన్ ను, కోర్ట్ లు తిరస్కరించాయి. మరోసారి జగన్ సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వెయ్యటం, సిబిఐ కోర్ట్ ఆ పిటీషన్ ని తిరస్కరించటంతో, జగన్ మోహన్ రెడ్డి ఈ సారి కూడా హైకోర్ట్ మెట్లు ఎక్కారు. మొదట్లో పిటీషన్ వేసి వెనక్కు తీసుకున్న జగన్, పిటీషన్ కు కొన్ని సవరణలు చేసి, మళ్ళీ కొత్త పిటీషన్ వేసారు. జగన్ వేసిన పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్, కౌంటర్ దాఖలు చెయ్యాల్సిందిగా సిబిఐ ని ఆదేశించింది. దీని పై కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ, జగన్ కు మినహాయింపు ఇవ్వద్దు అంటూ కోరింది.

అయితే సిబిఐ ఏ కారణాలతో జగన్ కు మినహాయింపు ఇవ్వద్దు అని కోరిందో, ఇంకా బయటకు రాలేదు. గతంలో సిబిఐ కోర్ట్ లో వేసిన కౌంటర్ లో, జగన్ పై తీవ్ర ఆరోపణలు సిబిఐ చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే జగన్, సాక్ష్యులను ప్రభావితం చేసారని, ఇప్పుడు ఆయన సియం అయ్యారని, తనకు ఉన్న అధికారంతో, ఇంకా సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, తన పిటీషన్ లో పేర్కున్న సంగతి తెలిసిందే. దీని పై, స్పందించిన సిబిఐ కోర్ట్, జగన్ పిటీషన్ ను తిరస్కరించింది. సిబిఐ కేసులు పక్కన పెడితే, ఈడీ కేసుల్లో కూడా, జగన్ ప్రతి వారం కోర్ట్ కు హాజరు కావాల్సి ఉండటంతో, ఈడీ కేసుల పై కూడా జగన్ మినహాయింపు ఇవ్వాలి అంటూ, కింద కోర్ట్ లో పిటీషన్ వెయ్యటం, అది కూడా కోర్ట్ తిరస్కరించటం, దాని పై హైకోర్ట్ లో జగన్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.

శాసనమండలి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు పై, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "రాజ్యాంగానికి వైసిపి నేతలు వాళ్లకిష్టం వచ్చినట్లు కొత్త భాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆర్టికల్స్, క్లాజ్ ల గురించి తమకిష్టం వచ్చిన భాష్యం చెప్పడానికి ఇది వైసిపి మేనిఫెస్టో కాదు, భారత రాజ్యాంగం. పరిపాలన సరిగ్గా చేయడం చేతకాదు. రాష్ట్రాన్నే సక్రమంగా నడపలేక పోతున్నారు. చివరికి చట్టసభలనూ కుంటుపడేలా చేస్తున్నారు. మనీ బిల్లులు, సాధారణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశ పెట్టడంపై రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 197,198లో నిర్దిష్టంగా చెప్పారు. ఆర్టికల్ 197 సాధారణ బిల్లులకు సంబంధించింది అయితే, ఆర్టికల్ 198మనీ బిల్లులకు సంబంధించినది. సాధారణ బిల్లులకు 14రోజుల నిబంధన వర్తించదు. సిఆర్ డిఏ రద్దు బిల్లు, అధికార వికేంద్రీకరణ బిల్లులు రెండూ మనీ బిల్లులు కావనే కౌన్సిల్ కు పంపేటప్పుడు స్పష్టంగా చెప్పారు. ఆ 2బిల్లులు మనీబిల్లులు కావని హైకోర్టుకు కూడా చెప్పారు. ఏజి వాదనల్లో కూడా హైకోర్టులో అవి మనీ బిల్లులు కావని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడా (నాన్ మనీ) బిల్లులకు 14రోజుల నిబంధన ఎలా వర్తిస్తుంది..? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా వైసిపి మంత్రులు మాట్లాడుతున్నారు."

"రాజ్యాంగానికి వైసిపి నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. రాజ్యాంగంలో ప్రొవిజన్స్ అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు 14రోజుల సమస్య ఉత్పన్నం కాదు. ‘‘ఎన్ని అడ్డదారులైనా తొక్కుదాం, తమ పంతం నెరవేర్చుకుందాం’’ అన్న మూర్ఖత్వమే వైసిపి నేతల మాటల్లో కనిపిస్తోంది. ఉరిశిక్షకి, స్పీకర్ విచక్షణాధికారానికి ముడిపెట్టడమే వాళ్ల పరిజ్ఞానానికి అద్దం పడుతోంది. ఉరిశిక్ష వేసే నేరానికి పాల్పడిన వాళ్లకు అదే శిక్ష న్యాయాధికారులు వేయడంలో వింత ఏముంటుంది. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి వైసిపి పంతం నెరవేర్చుకోవాలని చూడటం హేయం. సభాపతి సంబంధిత చట్టసభలో తీసుకున్న నిర్ణయం యావత్ సభా నిర్ణయం..ఒకసారి ఛైర్ పర్సన్ తన నిర్ణయాన్ని ప్రకటించాక దానిని ప్రశ్నించే అధికారంగాని, మార్చే అధికారంగాని సభ్యులకే కాదు, అధికారులకు కూడా ఎవరికీ ఉండదు. "

"సభా విషయానికి వచ్చేసరికి గౌరవ స్పీకర్(ఛెయిర్ పర్సన్) సుప్రీం. ఆయన ఆదేశాలను తప్పు పట్టడం అవివేకం. ఇప్పుడీ సెలెక్ట్ కమిటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా దీనిని అడ్డుకునే కుట్రలు చేయడం, కమిటి తదుపరి ప్రక్రియ ముందుకు సాగకుండా నిరోధించడం ‘‘సభా ధిక్కారం’’ కిందకు వస్తాయి. ఇలాంటి అంశంపై గతంలో ఇచ్చిన అనేక రూలింగ్స్ మన ముందే ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ చేస్తున్న ‘‘కుట్రలు’’ స్పష్టంగా కళ్లెదుటే ఉన్నాయి. ఏ విధంగా రాజ్యాంగ మార్గదర్శకాలను ఉల్లంఘించి, పార్లమెంటరీ ప్రొసీజర్, ప్రాక్టీసెస్ అతిక్రమించి వ్యవహరిస్తున్నారో కనబడుతోంది. ఇటువంటి ‘‘కుట్రలు’’ సభా ధిక్కారం కిందకు వస్తాయి. సభా ప్రొసీడింగ్స్ కు వ్యతిరేకంగా ఏ అధికారి వ్యవహరించరాదు. ఎవరైనా అలా వ్యవహరిస్తే అది నేరం, ప్రివిలేజ్ నిబంధనలను ఉల్లంఘించడమే. దానిపై సదరు గౌరవ సభ తగిన చర్యలు చేపట్టే అధికారం ఉంది." అంటూ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

సెలక్ట్ కమిటీ ముగిసిన అధ్యయనమని అధికారపక్షం తెగేసి చెప్తుండగా ప్రతిపక్షం మాత్రం కమిటీ సజీవంగానే ఉందని నిరూపిస్తామంటూ సవాల్ చేస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సెలక్ట్ కమిటీ రగడ రోజుకొక మలుపు తిరుగుతుంది. బిల్లులను సెలక్ట్ కమిటీకి 14 రోజులలోపు పంపాలని ఆ గడువులోపు కమిటీని ఏర్పాటు చేయలేకపోతే నిబంధనల ప్రకారం బిల్లులు పాస్ అయిపోయినట్లేనని అధికారపక్షం స్పష్టం చేస్తుంది. అయితే విపక్షం మాత్రం మండలి చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని యోచిస్తూ ఆ దిశగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఇదే క్రమంలో శాసన మండలిలో ఆమోదం కోసం పంపిన బిల్లులను గవర్నర్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఆ దిశగా గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవుతోంది. దీంతో సెలక్ట్ కమిటీ వివాదం కొత్త మలుపు తిరిగినట్లవుతుంది. ఇదే విషయంపై ఇరు పార్టీలు ఎవరి వాదనలు వారు వినిపించారు.

ప్రధానంగా అధికారపక్షం మాత్రం రెండు వారాల గడువు పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వం మండలికి పంపిన మూడు బిల్లులు పాస్ అయిపోయినట్లేనని ఈ విషయంలో ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా తామే విజయం సాధించామని ప్రకటించింది. ఇదే సందర్భంలో విపక్షం అధికారపార్టీపై నిప్పులు చెరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మండలి చైర్మన్ నిర్ణయాలను కూడా పాటించకుండా కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువస్తుందని ఖచ్చితంగా సెలక్ట్ కమిటీ వ్యవహారంపై తాము మరింత ముందుకు వెళతామని అవసరమైతే ఈ విషయంలో దూకుడుకూడా పెంచుతామని కరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి రాజకీయ యుద్ధ వాతావరణాన్ని సృష్టించే దిశగా సాగుతుంది. శాసనమండలిలో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి అను కూలంగా వ్యవహరిస్తున్న మండలి కార్యదర్శిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మండలిలో బలమున్న టిడిపి యోచిస్తూ ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతుంది.

శాసనమండలి చైర్మన్‌ఎంఎ.షరీఫ్ ముందు మూడు ఆపన్లు ఉన్నాయి. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను తిరస్కరించడమా..? లేక ఆమోదించడమా..? అది సాధ్యం కాకపోతే సెలక్ట్ కమిటీకి పంపాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వివాదాలను ఒక్కసారి పరిశీలిస్తే బిల్లులను ఆమోదించే పరిస్థితి లేదు. అలాగని తిరస్కరించడానికి గడువు కూడా ముగిసింది. ఇక ఆయన ముందు ఉన్న ఏకైక మార్గం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయడమే ఆ ప్రక్రియకు సంబంధించి మండలి కార్యదర్శి ఫైలను వెనక్కి పంపారు. దీంతో మండలి చైర్మెన్ ఈ విషయం పై, కోర్ట్ కు కూడా వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తుంది. ఒక సభ చైర్మెన్ కాని, స్పీకర్ కాని నిర్ణయం తీసుకుంటే, అది తప్పు బట్టే అవకాసం కోర్ట్ లకు కూడా ఉండదని, ఇక ఈ ప్రభుత్వ అధికారులు ఎంత అనే వాదన కూడా వస్తుంది. ఇప్పటికే రోజుకి ఒకసారి కోర్ట్ లు ప్రభుత్వాన్ని ఏదో ఒక సందర్భంలో మొట్టికాయలు వేస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా కోర్ట్ వరకు వెళ్తే, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రెండు, మూడు నెలల కోసం, ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంటుందో అర్ధం కావటం లేదు. సెలెక్ట్ కమిటీ ప్రజా అభిప్రాయం తీసుకుంటే, అది తమకు వ్యతిరేకంగా వస్తుంది అని ప్రభుత్వం భయం కావచ్చు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో, జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. దాదాపుగా 40 నిమిషాల పాటు, ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం తాను లేఖ రాసిన విషయాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు చోట్ల పెట్టటం పై, జగన్ మోహన్ రెడ్డి, ప్రధానికి తన అభిప్రాయాలు చెప్పి, ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి సహాయం అడిగినట్టు సమాచారం. అలాగే, మండలి రద్దు చేసి, ఆ బిల్లుని కేంద్రానికి పంపిన అంశం కూడా జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అసెంబ్లీలో అత్యంత పెద్ద మెజారిటీ ఉన్నా కూడా, మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో, అన్ని బిల్లులు అడ్డుకుంటున్నారని, ప్రతి బిల్లు లేట్ అవుతుందని, రెండేళ్ళ పాటు, విపక్షాల బలం ఎక్కువ ఉంటుందని, అందుకే మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జగన్, ప్రధానికి వివరించారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉందని, ఆ బిల్లుని వీలైనంత త్వరగా పాస్ చెయ్యాలని కోరినట్టు తెలుస్తుంది.

ఇక పోలవరంలో రావాల్సిన బకాయాలు విషయం కూడా ప్రధాని వద్ద ప్రస్తావించారు. మూడు వేల కోట్లకు పైగా, రావల్సి ఉందని, అవి తొందరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు పై కూడా జగన్ ప్రధానిని కోరినట్టు తెలుస్తుంది. ఇలా అన్ని విషయాల్లో కేంద్రం సహకారం కోరారు. అయితే ఈ సమయంలోనే ప్రధాని వైపు నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రావటంతో, సమావేశం హాట్ హాట్ గా మారిపోయింది. ముఖ్యంగా దావోస్ సదస్సులో, పీపీఏ ల సమీక్ష విషమై, వివిధ పారిశ్రామిక వేత్తలు లేవనెత్తిన అభ్యంతరాలను, ప్రధాని మోడీ జగన్ వద్ద ప్రస్తావించారు. పీపీఏల రద్దు విషయమై పారిశ్రామిక వర్గాల్లో ఉన్న ఆందోళనను, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ప్రధానికి వివరించిన సంగతి తెలిసిందే. ఇదే విషమై, ప్రధాని, జగన్ ను వివరణ కోరినట్టు సమాచారం.

అలాగే కియా మోటార్స్ విషయంలో, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల పై కూడా ప్రధాని మోడీ, జగన్ వివరణ కోరినట్టు తెలుస్తుంది. ఇక నరేగా నిధులు, కేంద్రం విడుదల చేసినా, రాష్ట్రం ఎందుకు విడుదల చెయ్యలేదు అనే విషయం పై కూడా, ప్రధాని వివరణ కోరారు. మొత్తంగా, జగన్ వినతులు, ప్రధాని ప్రశ్నలతో, ఈ సమావేశం ముగిసింది. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ శుక్రవారం ఢిల్లీ వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా, అయన బిజీగా ఉండటంతో, శుక్రవారం అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పినట్టు సమాచారం. దీంతో జగన్ మోహన్ రెడ్డి మరో సారి శుక్రవారం ఢిల్లీ వెళ్లి, కేంద్రం హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారని, వార్తలు వస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read