ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఏకంగా డీజీపీ తమ ముందు హాజరు అయ్యి వివరణ ఇవ్వాలి అంటూ, హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి, హైకోర్ట్ ఇచ్చిన కీలక ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు షాక్ ఇచ్చాయి. ఈ నెల 14న తమ ముందు హాజరుకావాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబందించిన విషయంలో తమ ముందు హాజరు కావాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజులు గడువు ఇచ్చిన హైకోర్ట్, కచ్చితంగా ఫిబ్రవరి 14న తమ ముందు హాజరు కావాలని, డీజీపీ గౌతం సవాంగ్ కు స్పష్టం చేసింది. ఇక కేసు పూర్వాపరాలు విషయానికి వస్తే, విజయవాడకు చెందిన, రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను, విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీసులు తీసుకు వెళ్ళారని ఆరోపణ. అలాగే, తమ న్యాయవాది ఇల్లు, కార్యయలల్లో కూడా పోలీసులు వచ్చి, సోదాలు చేసారని ఆరోపణ.

ఈ రెండు విషయాలకు సంబంధించి, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని, పోలీసులు విజయవాడ వచ్చి, అక్రమంగా అరెస్ట్ చేసారని, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పిటీషన్ ధాఖలు చేసారు. అయితే ఆ పిటీషన్ ను హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. విచారణకు స్వీకరించిన హైకోర్ట్, ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని. అంతే కాదు, జ్యుడీషియల్ విచారణ చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్ విచారణ చెయ్యాల్సిందిగా, విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని, హైకోర్ట్ నియమించింది. తమకు జరిగిన విషయం మొత్తం పై, పూర్తి నివేదిక ఇవ్వాలి అంటూ, హైకోర్ట్, విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జికి, కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వులను పాటించిన, విశాఖ సీనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ విచారణ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను, హైకోర్ట్ కు సమర్పించారు. విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు, ఆ నివెదికలోని అంశాలు ఆధారంగా, కీలక నిర్ణయం తీసుకుని. ఏకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తమ ముందు హాజరు కావలని, తమ ముందు హాజరు అయ్యి, వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అది కూడా రెండు రోజుల్లోనే హాజారు కావలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీని పై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అని, మొన్న క్యాట్ ట్రిబ్యునల్ లో, చీఫ్ సెక్రెటరికి అక్షింతలు పడ్డాయని, ఇప్పుడు కోర్ట్ లో డీజీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో, ఈ ఉదాహరణలే నిదర్శనం అని ఆరోపిస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిధుల కోసం కటకటలాడుతుంది. ఇప్పటికే ఆదాయం పూర్తిగా తగ్గిపోయి, అప్పుల మీద నెట్టుకు వస్తున్న జగన్ ప్రభుత్వం, కేంద్రం సహయం కోసం కూడా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే, కేంద్రం ప్రభుత్వం గత ఏడాది, రైతుల కోసం ప్రవేశపెట్టిన, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పధకం కింద ఇస్తున్న డబ్బులు ఒకే విడతలో ఇవ్వాలి అంటూ, జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ పధకం కింద, కేంద్రం, రూ.2వేల చొప్పున, మూడు విడతలుగా ఆరు వేలు ఇస్తుంది. దేశం అంతటా ఈ పధకం అమలులో ఉంది. అయితే, మూడు విడతలుగా కాకుండా, మా రాష్ట్రానికి మాత్రం ఒకేసారి ఆరు వేలు ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పధకం, కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా అమలు చేస్తుందని, దేశం అంతటా ఒకే విధానం ఉంటుంది కాని, మీ కోసం ప్రత్యేకంగా చూడలేము అంటూ, మంగళవారం పార్లమెంట్ లో కేంద్రం ప్రకటించింది.

నిన్న పార్లమెంట్ లో ఈ విషయం పై చర్చకు వచ్చిన సందర్భంలో, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి కాకుండా, రాష్ట్ర ఆర్ధిక శాఖ నుంచి వెళ్ళటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఉండగా, ప్రతి ఒక్క రైతుకు, రైతుభరోసా పథకం ఇస్తాం అని, దీని కోసం, రూ.12,500 ప్రతి ఏడాది ఇస్తామని ప్రకటించారు. రైతులు కూడా, కేంద్రం ఇచ్చే ఆరు వేలు, జగన్ ఇచ్చే, రూ.12,500తో, మొత్తం 18,500 వస్తాయని ఆశ పడి, జగన్ ను గెలిపించారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే, ప్లేట్ మార్చేసారు. ఈ పధకాన్ని, కేంద్రం ఇస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పధకంతో లింక్ పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 7500 రూపాయలు, కేంద్రం ఇచ్చే 6 వేలు కలిపి, మూడు విడతలుగా, 13500 ఇస్తున్నాం అని ప్రకటించారు. అయితే, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ డబ్బులు మూడు విడతలుగా ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తూ, కేంద్రాన్ని మాత్రం, ఒకేసారి ఇవ్వమని కోరటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. నిధుల కోసం, కటకటలాడుతున్న ప్రభుత్వానికి, వెసులుబాటు కోసం, ఇలా అడిగి ఉంటారని అంటున్నారు. కాని, కేంద్రం మాత్రం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఇవ్వలేమని, అందరికీ మూడు విడతలుగా ఎలా ఇస్తున్నామో, అలాగే ఇస్తామని చెప్పింది. మరో పక్క, ఈ పధకంలో లబ్దిదారులను కూడా ప్రభుత్వం కుదించింది అనే వాదన వినపడుతుంది. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో, ప్రభుత్వం అనేక నిబంధనలతో, వారికి సహాయం చెయ్యలేదు అనే విమర్శలు వచ్చాయి.

వైసిపి ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం నుంచి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం విజయవాడలో జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు ఈ షెడ్యూల్ ప్రకటించారు. 45రోజులపాటు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి ప్రజలను చైతన్య పర్చాలని, వైసిపి ప్రభుత్వ దోపిడిని ఎండగట్టాలని పిలుపిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ రాష్ట్రంలో వైసిపి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయింది. శాండ్ మాఫియా/ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా/వైన్ మాఫియా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బోగస్ ఇన్ వాయిస్ లతో, నకిలీ రశీదులతో రీచ్ లనుంచి, స్టాక్ పాయింట్ల నుంచి యధేచ్చగా ఇసుక దోచేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ ఇన్ వాయిస్ లతో వైసిపి నేతలే ఇసుక కొల్లగొడుతున్నారు. ఇక మద్యం అమ్మకాల్లో పెద్దఎత్తున గోల్ మాల్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు తగ్గినట్లు చూపి తెలంగాణ మద్యానికి గేట్లు ఎత్తేశారు. పొరుగు రాష్ట్రాలనుంచి మద్యం ఏరులై పారుతోంది. అందుకే ఆయా రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి."

"తమకు ముడుపులు చెల్లించే సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే అమ్మిస్తున్నారు. ల్యాండ్ మాఫియా పేట్రేగిపోయింది. ఒక్క విశాఖలోనే 32వేల ఎకరాలు ఆక్రమించారు. కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తున్నారు. అసైన్డ్ భూములను బెదిరించి లాగేస్తున్నారు. చెరువులు పూడ్చేసి ఆక్రమిస్తున్నారు. గనుల లీజుదారులను వాటాల కోసం బెదిరిస్తున్నారు. వినని వాళ్ల లీజులు రద్దు చేసి, సొంత వాళ్లకు కేటాయిస్తున్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పటికే 30సార్లు కోర్టులు అక్షింతలు వేశాయి. అయినా వైసిపి నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు తప్పు పట్టింది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. సొంత బాబాయి హ-త్య జరిగి ఏడాది కావస్తున్నా హం-త-కు-ల-ను పట్టుకోలేక పోయారు. తనకు రక్షణ లేదని, తండ్రిని హ-త్య చేసిన వాళ్లవల్ల తనకు ప్రా-ణ-హా-ని ఉందని, తండ్రి హ-త్యపై సిబిఐ విచారణ జరిపించాలని, తనకు రక్షణ కల్పించాలని వి-వే-కా-నం-ద రెడ్డి కుమార్తె కోరింది. అది జరగ్గానే సిబిఐ విచారణపై గతంలో తాను వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి. తప్పుడు కేసులతో ప్రత్యర్ధులు మనలను వెంటాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనలో మనం కలహించుకోరాదు. విభేదాలు వదులుకోవాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. పేదలకు అండగా ఉండాలి. కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. నాయకులకు అండగా ఉండాలి."

"సంస్థాగత కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి. అన్నిస్థాయిల్లో సమర్ధవంతమైన వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి. మీ నియోజకవర్గాలను చూసుకోవాలి, పరిశీలకులుగా మీ బాధ్యతలను నిర్వర్తించాలి. వైసిపి ప్రభుత్వ బాధితులకు అండగా ఉండాలి. గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన వాళ్ల బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నరేగా బిల్లులను మొదట చేసినవాటికే తొలుత చెల్లింపులు జరపాలని కేంద్రం ఆదేశించినా బేఖాతరు చేశారు. హైకోర్టు తప్పు పట్టినా పట్టించుకోవడం లేదు. నరేగా స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాలి. ఆశయం మంచిదైతే చాలదు, దాని అమల్లో చిత్తశుద్ది లేకపోతే ఇలాగే ఉంటుంది. ఉదాత్తమైన పథకం నరేగా వైసిపి నిర్వాకాల వల్ల నీరుగారిపోయిందని’’ చంద్రబాబు అన్నారు.

యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ‘‘ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. కష్టపడి సంపాదించడం, ఖర్చు పెట్టడం, చాలకపోతే అప్పులు చేయడం కుటుంబంలో అయినా, వ్యవస్థలో అయినా సాధారణంగా జరిగే ప్రక్రియ. వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా ఆర్ధిక క్రమశిక్షణ ముఖ్యం. రాబడి, వ్యయం, అప్పుల మధ్య సమతుల్యం ఉండాలి. విచ్చలవిడిగా చేస్తే ఇలాంటి పరిణామాలే ఉత్పన్నం అవుతాయి. రాష్ట్ర రాబడి 16% పడిపోయింది. అప్పులు 17% పెరిగాయి, ద్రవ్యోల్బణం 6% పెరిగింది. ఏదీ కొనేట్లు లేరు, ఏదీ తినేట్లు లేరు. తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది, కొనుగోలు శక్తి, పొదుపు శక్తి క్షీణించాయి. ఏదీ సమర్ధంగా నిర్వహించలేకే దా-డు-లు, దౌ-ర్జ-న్యా-ల-కు దిగారని’’ ధ్వజమెత్తారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ‘‘ రాష్ట్రంలో సారా అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. సారా సామ్రాజ్యం నడుస్తోంది. ఏడాదికి రూ 20వేల కోట్ల ముడుపులు టార్గెట్ పెట్టుకున్నారు. మద్యం అమ్మకాలపై రూ 6వేల కోట్లు టార్గెట్. కమిషన్లు ఇచ్చిన సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారు. సిమెంట్ పై బస్తాకు రూ 10 జె ట్యాక్స్ కంపెనీల నుంచి వసూలు చేస్తున్నారు. బస్తాకు రూ 50పెంచి అమ్ముతూ వినియోగదార్లను దోచుకుంటున్నారు. సిమెంట్ అమ్మకాలపై రూ 4వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. వైసిపి నేతల దోపిడి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని’’ కోరారు.

నూకల బాలాజీ మాట్లాడుతూ, ‘‘ టిడిపి క్రమశిక్షణ ఉన్న పార్టీ అయితే, వైసిపి బూతు శిక్షణ ఇచ్చేపార్టీ..వైసిపికి సంస్థాగత నిర్మాణం లేదు, టిడిపికి నిర్మాణం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి గ్రామాల్లో బలమైన నాయకత్వం వస్తే టిడిపిని ఎవరూ ఎదుర్కోలేరు. నోరువాయి లేని వారిని కమిటిల అధ్యక్షులుగా పెడితే గ్రామాల్లో నాయకత్వం బలపడదు. బలమైన వాళ్లను కమిటిల్లో ఎంపిక చేసుకోకపోతే పార్టీకి ద్రోహం చేసిన వారవుతారు. పించన్ల తొలగింపు, కార్డుల తొలగింపుతో వైసిపిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో ఆ వ్యతిరేకతను టిడిపికి సానుకూలం చేసుకుంటే స్థానిక సంస్థల్లో గెలుపు ఖాయం’’ అని అన్నారు. గౌరివాని శ్రీనివాసులు మాట్లాడుతూ, ‘‘ ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదని టిడిపిని మొదటి 3ఏళ్లు విమర్శించారు వైసిపి నేతలు, కానీ టిడిపి పాలనలో ముస్లింల సంక్షేమానికి ఎన్నో వినూత్న పథకాలు పెట్టారు, పెద్దఎత్తున బడ్జెట్ కేటాయించారు, కానీ ఈ 9నెలల్లో ముస్లింకు డిప్యూటి సీఎం ఇచ్చినట్లు గొప్పలు చెబుతూ టిడిపి చేసిన సంక్షేమం అంతా నిలిపేశారని, రంజాన్ తోఫా, దుల్హన్ ఆపేశారని, ఇమాంలు, మౌజన్ లకు వేతనాలు ఆపేశారని ఒక ముస్లింలే తనతో చెప్పి వాపోయారని’’ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా, సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రసంగం, అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు ముందే, కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఆయన మాట్లాడుతూ. "1983 రాజకీయాలు వేరు..ఇప్పుడు రాజకీయాలు వేరు..అప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు..ఇప్పుడు సిద్దాంతాలు/ విధానాలు వేరు.. భూములు దోచేవాడు, ఖూనీలు చేసేవాడే రాజకీయాలు చేసే రోజులొచ్చాయి. ఎన్టీఆర్ సీటిచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో రూ 35వేలు ఖర్చు అయ్యింది.ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ 4వేలు ఇచ్చారట, మా బంధువులే చెప్పారు. పంచాయితీ ఎన్నికలొస్తే పోటీకి రాకూడదనే భయం రేకెత్తిస్తున్నారు. కానీ ఈ రోజుకూ ఎవరూ లొంగడానికి సిద్దంగా లేరు. ఈ కష్టకాలంలో కూడా లక్షలాది కార్యకర్తలు పార్టీకి దృఢంగా నిలబడిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. చట్టాలంటే విశ్వాసం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, రాజ్యాంగంపై నమ్మకం లేదు..పనికిమాలిన వాడు పాలకుడైతే ఇలాగే ఉంటుంది. జనం అల్లాడిపోతున్నారు, వైసిపికి భయపడి కాదు..వీళ్ల వేధింపులకు తట్టుకోలేక పోతున్నారు."

"నరేగా బిల్లులు జాప్యం చేయగలరేతప్ప వాటిని ఆపలేరు. జగన్ కాదు కదా, ఆయన బాబు దిగివచ్చినా ఆపలేరు. టిడిపిని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు ఒక్కడిదే కాదు. షో వర్క్ చేయవలసిన సమయం కాదు. కష్టకాలంలో షో వర్క్ చేయకుండా అందరూ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలి. అకస్మాత్తుగా ఫోన్ చేసి ఆందోళన చేయమంటే ఏవో కొద్దిమందితో చేస్తే ఇంపాక్ట్ రాదు. రెండు మూడు రోజుల ముందు చెబితే, వేలాదిమందితో చేస్తే ఆ ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది. పార్టీకి మనం ఎంత అవసరమో, మనకు పార్టీ అంతకన్నా అవసరం’’ అనేది అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మొన్న ఒకామె పించన్ తొలగించారని గింజుకుంటుంటే చెప్పాను, ‘‘ గట్టిగా కొట్టుకోబాకు, ఇంకా 4సంవత్సరాలు కొట్టుకోవాలని’’ చెప్పాను. ఇప్పటికీ నిద్ర పట్టడం లేదు రాత్రుళ్లు..23సీట్లు ఇచ్చేంత తప్పు చేశామా..? ఓడిపోతే, ఓడిపోతాం రాజకీయంగా..అపోజిషన్ లో ఉన్నప్పటికన్నా ఎక్కువ కష్టపడ్డాం. అమ్మవడికి డబ్బుల్లేక, ఈ రోజు విశాఖలో 2వేల ఎకరాలు అమ్మేసి చేస్తాడంట. ‘‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’’ ఇందులో తప్పేంటి..?బుర్ర ఉన్నోడు ఎవడైనా 3రాజధానులు అంటారా..? నీ దయవల్ల ఉద్యోగాలు వచ్చే కంపెనీలన్నీ పోయాయి. విశాఖలో ఏం చేస్తావు 3బిల్డింగులతో..?"

"నువ్వు చేశావా, నీ బాబు చేశాడా విశాఖకు ఏమైనా..? ఏదైనా చేస్తే చంద్రబాబు చేశాడు విశాఖకు. బొమ్మను మార్చినట్లు మారుస్తావా రాజధానిని..? ఎన్నికల్లో ఎక్కడైనా చెప్పావా రాజధానిని మారుస్తానని..? లేదూ మేనిఫెస్టోలో రాశావా..? ఇదేమైనా చిన్నవిషయమా, చాలా సీరియస్ విషయం. పెద్దలందరినీ కూర్చోపెట్టి నా ఆలోచన ఇదని చెప్పావా..? ఎవరితోనైనా చర్చించావా..? ప్రజాభిప్రాయం తీసుకున్నావా..? నీకు సిగ్గు లేకపోతే, అది చేసే వాళ్లకైనా సిగ్గుండాలి కదా..? రాజధానికి కేంద్రం రూ 2,500కోట్లు ఇచ్చింది, మరి దానిని మారుస్తానని వాళ్ల పర్మిషన్ తీసుకున్నావా..? శంకుస్థాపన చేసిన ప్రధానికి అయినా చెప్పావా..? రాష్ట్రాలలో ఇలాంటి తిక్క పనులు చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోరాదు. ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అతని దురుద్దేశం..25మంది ఎంపిలనిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పి, ఈ 8నెలల్లో ప్రత్యేక హోదా గురించి ఎక్కడన్నా మాట్లాడారా..? హోదా గురించి జగన్ మాట్లాడి ఎన్ని నెలలైంది..? మా రామ్మోహన్ నాయుడు, మా జయదేవ్ మాట్లాడుతుంటే, మీ వాళ్లను ఆ ఇద్దరి మీదకు ఉసిగొల్పుతావా..?

"ప్రతి పనికిమాలిన నా...బూతులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ దౌర్భాగ్యులు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మనం మాట్లాడాలి బహిరంగంగా.. మాట్లాడే దమ్ము లేకపోతే, మీకు-జగన్ కు బంధుత్వాలు ఉంటే, వెళ్లి ఇంట్లో కూర్చోండయ్యా.. గ్రామీణాభివృద్ది మంత్రిగా నేను ఢిల్లీ వెళ్లినప్పుడు మన అధికారులు ప్రజెంటేషన్ ఇస్తే, వెళ్లి చంద్రబాబు దగ్గర నేర్చుకోమని ఇదే ప్రధానమంత్రి అక్కడున్న అధికారులతో అప్పట్లో చెప్పారు. నేనే అందుకు సాక్ష్యం.. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు. వీళ్లు తిట్టినంతమాత్రాన ఆయన గొప్పదనం తగ్గేది కాదు. ఒక నియోజకవర్గం చూసే మనకే ఇన్ని సమస్యలుంటే, 175నియోజకవర్గాలు చూసే ఆయన(చంద్రబాబు)కెన్ని సమస్యలు..? మనం అర్ధం చేసుకోవాలి. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పదిమందిని కూడగట్టాలి. పేదలకు అండగా ఉండాలి. కష్టాల్లో అండగా ఉన్నప్పుడే మనల్ని గుర్తుంచుకుంటారు. ఇది అందరికీ కష్టకాలం. 19లక్షల కార్డులు తొలగించారు, 6లక్షల పించన్లు తొలగించారు. టిడిపి స్కీములన్నీ రద్దు చేశారు. పేదవాడి నోటికాడ ముద్ద తీసేశారు. ఇప్పుడే నాయకుడనే వాడి అండ అవసరం వాళ్లకు. కాబట్టి అందరూ కమ్ముకోవాలి.రాష్ట్రాన్ని కాపాడుకోవాలి." అంటూ అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.

Advertisements

Latest Articles

Most Read