మూడు ముక్కల రాజధాని అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తరువాత, ప్రజలందరూ, ముందుగా కేంద్రం వైపు, తరువాత కోర్ట్ ల వైపు ఆశగా చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కల రాజధానితో, ఎవరికీ ఉపయోగం ఉండదని, ఇప్పటికే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తన నిర్ణయాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే ఉన్నారు. 55 రోజులుగా అమరావతి ప్రజలు నిరనస చేస్తున్న లెక్క చెయ్యటం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు, మేము అమరావతిని మేము కాపాడతాం అంటూ బయలుదేరాయి. కాని ఏమైందో ఏమో కాని, మొదట్లో చూపించిన ఉత్సాహం, ఇప్పుడు కనిపించటం లేదు. బీజేపీ కాని, ఇటు జనసేన కాని, అసలు అమరావతి గురించే మాట్లాడటం లేదు. అయినా ఏపి ప్రజలు ఆశగా కేంద్రం వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి స్పీడుకు, కేంద్రం బ్రేకులు వేస్తుందని, ఆశగా చూస్తున్నారు కాని, కేంద్రం మాత్రం ఏ మాత్రం స్పందించటం లేదు.

ఈ క్రమంలోనే, ఈ రోజు పార్లమెంట్ లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆడిగిన ప్రశ్నతో, మరోసారి, కేంద్రం వైఖరి స్పష్టం అయ్యింది. కేశినేని నాని మొత్తం నాలుగు ప్రశ్నలు అడిగారు. ఒక రాష్ట్రం, రాజధానిని ఎంపిక చెయ్యాలి అంటే, ఏదైనా ప్రక్రియ ఉందా ? ప్రక్రియ ఉంటే, వాటి వివరాలు చెప్పండి. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో, తమ నూతన రాజధానులు ఎలా ఎంపిక చేసుకున్నాయి ? ప్రభుత్వానికి, ఈ విషయంలో ఏదైనా పాత్ర ఉంటుందా అని కేశినేని నాని ప్రశ్నించారు. అయితే దీని పై, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం చెప్తూ, రాష్ట్ర రాజధానులు ఎంపిక చేసుకునే అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అంటే మాకు ఏ సంబంధం లేదు అని కేంద్రం చెప్పి, తప్పించుకుంది. వారం క్రితం, గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం ఇలాగే సమాధానం చెప్పింది. కాకపొతే అప్పుడు, అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేసారు అని ప్రకటన చేసింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్నకు మాత్రం కేంద్రం సమాధానం చెపాల్సి ఉంటుంది. కొత్త రాజధానులు అంశం అయితే రాష్ట్రాలు ఇష్టం అనుకోవచ్చు కానీ, ఇప్పటికే ఉన్న రాజధానిని మార్చటం కేంద్రం ఎలా సమర్ధిస్తుంది ? అది కూడా ఇప్పటికే 2500 కోట్లు కేంద్రం అమరావతికి ఇచ్చి, ఇప్పుడు అది నిరుపయోగంగా పడేస్తాం అని రాష్ట్రం అంటుంటే, కేంద్రం మాకు సంబంధం లేదు, అది రాష్ట్రం ఇష్టం అనటం ఎంత వరకు సమంజసం ? ఇదే సంస్కృతి అన్ని రాష్ట్రాలకు పాకితే, అధికారం మారిన ప్రతిసారి, ఇలా రాజధానులు మార్చితే, కేంద్రం చూస్తూ ఉంటుందా ?

జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు, అంటే బుధవారం ఢిల్లీ టూర్ ప్లాన్ చేసారు జగన్. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోడీని, కేంద్రం హోం మంత్రి అమిత్ షాని కలుస్తారని, సమాచారం. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తుంది. అలాగే రేపు కాని, గురువారం ఉదయం కాని, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, గత మూడు సార్లుగా, జగన్ ఢిల్లీ వెళ్ళటం, అపాయింట్మెంట్ లేక తిరిగి రావటం జరుగుతూ వస్తున్నాయి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, గత మూడు సార్లుగా, జగన్ పడరాని పాట్లు పడి, చివరకు తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఒక్కసారి మాత్రం, ఆయన పుట్టిన రోజు అని వెళ్లి విష్ చేసారు కాని, ఎలాంటి అపాయింట్మెంట్ దొరకలేదు. ఇక హోం మంత్రి అమిత్ షా నే, అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో, కేంద్ర మంత్రులు కూడా, ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు సార్లుగా జగన్ ఢిల్లీ టూర్ ఫ్లాప్ అవుతూ వస్తుంది.

ఢిల్లీలో వ్యవహారాలు చూసే విజయసాయి రెడ్డి, ఈ విషయంలో ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నారు. కనీసం ఒక సిఎంకు, మూడు సార్లుగా అపాయింట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి. మరి ఈ సారి అయినా, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో అయితే, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందని, జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ప్రధాని మోడీని కలుస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, జగన్ మోహన్ రెడ్డి, కేంద్రంలోని పెద్దలకు చెప్పి, వాళ్ళను ఒప్పించే విషయమై లాబయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అదే పని చేస్తున్న విజయసాయి రెడ్డికి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తోడు అవుతున్నారు.

ముఖ్యంగా మూడు ముక్కల రాజధాని అంశం పై, కేంద్ర పెద్దల నుంచి, అనుకూలంగా నిర్ణయం రాబట్టే ప్రయత్నం చెయ్యనున్నారు. అలాగే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ వేసిన దెబ్బతో, మండలిని కూడా రద్దు చెయ్యాల్సిన పరిస్థితి రావటంతో, ఆ బిల్ ఇప్పుడు కేంద్రం చేతిలో ఉండటంతో, ఎలాగైనా, శాసనమండలి రద్దు బిల్లుని ఉభయసభల్లో పాస్ చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర పెద్దలను కోరనున్నారు. ఈ రెండు అంశాలు, కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉండటంతో, ఇవన్నీ అమిత్ షా కి చెప్పాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే, మరి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ఇక మరో అంశం అయిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై, ఎలాగైనా తెలుగుదేశం నేతల పై, ముఖ్యంగా చంద్రబాబు పై, సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని జగన్ భావిస్తున్నారు. ఈ విషయం కూడా రేపు ప్రస్తావించే అవకాసం ఉంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని వైపుల నుంచి ఎలాంటి ఒత్తిడి పెట్టాలో, అలాంటి ఒత్తిడి పెడుతూ, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది. ప్రజల సంగతి ఏమో కాని, ప్రతిపక్షాల వేధింపులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేస్తున్నారని, వారిని వేదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది. మానసికంగా వేధిస్తూ, ప్రతిపక్ష పాత్ర చెయ్యనివ్వకుండా, ప్రజల్లో తిరగానివ్వకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు, మాజీ మంత్రులకు భద్రత తగ్గించిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా భద్రతను పూర్తిగా తొలగిస్తూ, సంచలన నిర్ణయం తీసుకోవటం చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తున్న టిడిపి నేతలు, రాజశేఖర్ రెడ్డి టైములో, పరిటాల రవికి ఇలాగే చేసి, చంపేసిన ఉదంతాన్ని చూసి భయపడుతున్నారు.

తాజగా జగన్ ప్రభుత్వం, చాలా మంది తెలుగుదేశం సీనియర్లకు, ముఖ్య నాయకులకు భద్రత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రిందట, నారా లోకేష్ భద్రతను కుదించిన విషయం తెలిసిందే. నక్సల్స్ హిట్ లిస్టు లో ఉన్న లోకేష్, తొందర్లోనే సెలెక్ట్ కమిటీ విషయమై, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే, నారా లోకేష్ స్వేచ్చగా గ్రామాల్లోకి, వివిధ ప్రాంతాలకు వెళ్ళకుండా, భద్రత తొలగించారని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే మూడు రోజుల క్రితం, తెలుగుదేశం సీనియర్ నేతలు అయిన, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిల భద్రతను తొలగించింది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలగించటం ఆశ్చర్యకర విషయమే.

ఎందుకంటే, అది ఫాక్షన్ ఏరియా కావటం, జేసీ కూడా దూకుడుగా ఉండే మనిషి కావటంతో, జేసీని ఆత్మరక్షణలో పడేసి, మానసికంగా ఇబ్బంది పెట్టే చర్యగా దీన్ని భావించ వచ్చు. అయితే ఇప్పుడు తాజగా, కృష్ణా జిల్లాలో సీనియర్ మంత్రి అయిన, దేవినేని ఉమాకు భద్రత తొలగించారు. ఉమా చురుగ్గా అమరావతి ఉద్యమంలో పాల్గుంటున్న సంగతి తెలిసిందే. ఇక మరో సంచలన విషయం ఏమిటి అంటే, పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి కూడా భద్రత తొలగించటం. ఈ రోజు వీరి ఇద్దరి రక్షణ తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంతే కాకుండా, వెంటనే వెనక్కు రావాలని, ఇవాళ మధ్యాహ్నంలోపు గన్‌మెన్‌లందరూ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని, ప్రభుత్వం ఆదేశించటం కొసమెరుపు. ఇప్పటికే చంద్రబాబుకి కూడా భద్రత తగ్గించగా, ఆయన హైకోర్ట్ కు వెళ్లి, మళ్ళీ సెక్యూరిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

మూడు ముక్కల రాజధాని పై, అమరావతి రైతులు హైకోర్ట్ గడప తోక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వాదనలు వినిపించటానికి, రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ, ఒక సీనియర్ లాయర్ ని ఢిల్లీ నుంచి తీసుకు వచ్చారు జగన్. అయితే, ఏకంగా 5 కోట్లు ఒక లాయర్ కి, ప్రజాధనం ఇవ్వటం పై, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని, ఈ కేసు కోసం జగన్ తీసుకు వచ్చారు. 5 కోట్లు ఆయన ఫీజు అంటూ జీవో ఇచ్చారు. ఇప్పటికే ఒక కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం తరుపున, ముకుల్ రోహత్గి నియామకాన్ని సవాల్ చేస్తూ ఆర్ శివాజీ అనే న్యాయవాది, హైకోర్ట్ లో పిల్ వేసారు. ప్రభుత్వం తరఫున రోహత్గిని నియమించడం అడ్వొకేట్ చట్టానికి విరుద్ధమని పిల్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును హైకోర్ట్ పరిగణలోకి తీసుకోదని, వైసీపీ పార్టీ భావించింది. కాని, అనూహ్యంగా హైకోర్ట్, ముకుల్ రోహత్గీకి నోటీసులు జరీ చేసింది. ఈ విషయం, పై సమాధానం చెప్పాలి అంటూ, ఆయనకు నోటీసులు ఇస్తూ, కేసును వాయిదా వేసింది.

మరో పక్క, రాజధాని గ్రామాల్లో 55 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడు న్యాయస్థానం వైపు చూస్తున్నారు. రాయప వాడిలో సోమవారం ఆందోళనకారులు వినూత్న నిరసన తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రెండువైపులా నిల్చుని దండం పెడుతూ నిలబడ్డారు. న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ న్యాయస్థానం తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మరో వైపు కృష్ణాయపాలెం శివాలయం సెంటరులో ప్రయాణి కులు గులాబీపూలు పంచుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. మందడం, రాయపూడి, వెలగ పూడి, తుళ్ళూరు. కృష్ణాయ పాలెం తదితర గ్రామాల్లో ఆందోళన శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ శిబిరాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మద్దతు పలుకు తున్నారు. సోమవారం టిడిపి సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు వెలగపూడి శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. రాజధాని గ్రామాల రైతుల త్యాగా లను విస్మరించటం చారిత్రక తప్పిద మని ఈ సందర్భంగా రైతులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఫ్యాక్షన్ సంస్కృతితో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ భూములిచ్చిన రైతులపై కక్ష సాధింపు చేస్తున్నాడని విమర్శించారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఎలా ఇస్తారు...వాటిని వ్యవసాయయోగ్యం గా మార్చి తిరిగి ఇవ్వటం సాధ్యపడు తుందా అని ప్రశ్నించారు. తమ ప్రాంతానికి రాజధాని వస్తుం దంటే విశాఖవాసులకు భయమేస్తుందన్నారు. రాజధాని విషయంలో కేంద్రం స్పందించకపోయినా న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read