జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుఉండి, ప్రధాని మోడి, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు సాయంత్రం కానీ, రేపు కానీ ఢిల్లీ వెళ్లనున్నారు. నిజానికి ఈ నెల నాలుగవ తేదీన, హోం మంత్రి అమిత్ షా తిరుపతిలో, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. దీంతో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు అయ్యింది. ఆ సమావేశంలో ఎన్నో అంశాలు లేవనెత్తాలని జగన్ మోహన్ రెడ్డి భావించారని, ఆ సమావేశం రద్దు కావటంతో, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కలిసి విన్నవించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాని మోడీతో పాటుగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడా కోరారు. ఈ అప్పాయింట్మెంట్ లు ఖరారు అయితే, ఈ రోజు రాత్రి కాని, రేపు కాని జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు ప్రస్తావిస్తారని, ముఖ్యంగా పోలవరం విషయంలో ఉన్న గందరగోళం పై చర్చిస్తారని చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించే అంశం పై వార్తలు వస్తున్న నేపధ్యంలో, అలాగే కేంద్ర జల శక్తి శాఖ కూడా ఈ అంశం పై చర్చలు జరుపుతూ ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.

అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇతర ఆర్ధిక పరమైన అంశాలతో పాటుగా, విభజన సమస్యల పై కూడా చర్చిస్తారని చెప్తున్నారు. దక్షినాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ అంశాలు అయితే చర్చించాలని అనుకున్నారో, ఆ అంశాలు అన్నీ అమిత్ షా తో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తుంది. పనిలో పనిగా, ప్రధాని మోడీని కలిసి చాలా రోజులు అయిన నేపధ్యంలో, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయన వద్ద ప్రస్తావించనున్నారు. అయితే గత రెండు మూడు సార్లుగా జగన్, మోడీ అపాయింట్మెంట్ కోరుతున్నా, అది వీలు పడటం లేదు. ఈ సారైనా అపాయింట్మెంట్ లభిస్తుందని భావిస్తున్నారు. అయితే వీరి ఇరువురిలో ఒకరి అపాయింట్మెంట్ లభించినా, జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇంట సడన్ గా ఢిల్లీ వెళ్ళటం పై, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. పోలవరం కానీ, ఇతర సమస్యలు కానీ, ఇప్పుడు కొత్త ఏమి కాదని, వీటి కోసం ఇంట హుటాహుటిన జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదనే వాదన కూడా ఉంది.

నిన్న ఒక ప్రాముఖ పత్రికలో వచ్చిన వార్త, ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది. అయితే నిన్న చంద్రబాబు టూర్ ఉద్రిక్తంగా మారటంతో, అందరూ ఈ విషయం మర్చిపోయారు. ఆ వార్త ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు, రూ.30 కోట్ల రూపాయాలు, డీల్ లో లబ్ది పొందారని. రాయలసీమలోని ఒక అశ్రామంలో ఐటి అధికారులు సోదాలు జరపగా, రూ.400 కోట్లకు పైగా అనధికారికంగా ఉన్న లావాదేవీలను వారు గుర్తించారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ బీజేపీ నేత, రంగంలోకి దిగి, తనకు కేంద్రంలో పలుకుబడి ఉందని, మీకు సాహయం చేస్తాను అంటూ రంగంలోకి దిగారు. ఆ నేతకు తోడుగా, మరో నేత కూడా తోడయ్యారు. అందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ అయ్యి, డీల్ కుదుర్చుకున్నారు. 30 కోట్లు ఇస్తే, ఈ కేసులో ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, డీల్ సెట్ చేసుకున్నారు. అంతా సాఫీగా జరిగిపోయినా, విషయం బయటకు పొక్కింది. కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగి, మొత్తం విషయం కూపీ లాగాయి. విషయం జాతీయ బీజేపీ అధిష్టానం వద్దకు చేరింది. ఆ ఇద్దరి నేతల వల్ల పార్టీ పరువు పోతుందని, అధిష్టానం భావించింది. వారి పై చర్యలు తీసుకునే, మరింతగా వారు చేసిన పనులు పై ఆధారాలు సేకిరించి, వారి పై వేటు కూడా వేస్తారని, నిన్న పత్రికలో వచ్చిన కధనం.

అయితే ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు అనేది మాత్రం ఆ పత్రిక రాయలేదు. ఒకరు కేంద్రంలో కేబినెట్‌ హోదా ఉన్న వ్యక్తి అని, అలాగే ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే ప్రముఖ నేత అంటూ రాసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు వీరే అంటూ సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. అనంతపురంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన రామకృష్ణ, ఆశ్రమం పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి, అక్రమ ఆస్తులు గుర్తించారని, ఇదే అదునుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగారని, దీని కోసం ఇద్దరు నేతలు డీల్ కుడుర్చుకున్నారని, ఆ ఇద్దరు నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు అని, వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయని సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. కోట్ల రూపాయాలు సంపాదించిన దొంగ స్వాములతో, ఈ బీజేపీ నేతలు అంటకాగుతున్నారని వాపోయారు. తాను ఈ విషయం పై తిరుపతికి ఫోన్ చేసి అడిగితే, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు పేర్లు చెపుతున్నారని, ఈ కధనం వచ్చి 24 గంటలు అయినా, ఎవరూ ఖండించలేదని, వారిద్దరూ కాకపోతే, ఎందుకు ఇప్పటి వరకు ఎవరూ ఖండించలేదని ప్రశ్నించారు.

హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు అయిన పిటీషన్ పై నిన్న విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మేనిఫెస్టో విడుదలపై కమిషన్ సరిగా స్పందించ లేదని, కేవలం మ్యానిఫెస్టోని బయటకు వెళ్ళకుండా ఆపారని, కె.శివరాజశేఖర్‌రెడ్డి అనే పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమ వారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ అరూప కుమార్ గోస్వామి, న్యాయ మూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు ఉపక్రమించింది. మేనిఫెస్టో విడుదలై ఎస్ఈసీ స్పందించకపోతే తగిన వేదికను ఆశ్రయించాలని సూచించింది. ఈ అంశంపై పిల్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై మీకు అభ్యంతరం ఉంటే, నిబంధనలు మేరకు తగిన వేదికను ఆశ్రయించాలని కోర్టు పేర్కొంది. మ్యానిఫెస్టో ఉపసంహరించారని, కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాత్రం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ పిటీషన్ వాదించారు. అందుకే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చంద్రబాబు పై చర్యలు తీసుకోలేదు కాబట్టి, మీరు చర్యలు తీసుకోవాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు.

అయితే ఈ వాదన పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మ్యానిఫెస్టో ప్రచురణ చేసింది, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే, మీరు పదే పదే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేరు ఎందుకు చెప్తున్నారు అని వ్యాఖ్యానించిన కోర్టు, చంద్రబాబుని ప్రతివాదిగా చేర్చటం పై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిల్ కు విచారణ చేసే అర్హత లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు అంటే, తగిన నిబంధనలు చూపించి, తగిన వేదికను ఆశ్రయించాలని హైకోర్టు పేర్కొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పంచ సూత్రాల పేరుతో, తెలుగుదేశం పార్టీ ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది. తాము బలపరిచిన అభ్యర్ధులు గెలిస్తే, ఏమి చేస్తామో చెప్పారు. అయితే, పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదని చెప్పిన వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ని వెనక్కు తీసుకోవాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ మ్యానిఫెస్టో బయటకు రాలేదు.

వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకో రాదంటూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరుసటిరోజైన సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్ కు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీనామినేషన్ కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనున్నది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 8, 10, 21,41, 45 డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో 9, 14, 28 వార్డులు, రాయచోటి మున్సిపాలిటీలో 20, 21 వార్డుల్లోనూ రీనామినేషను ఆదేశాలు జారీచేశారు. అలాగే, కడప జిల్లా యర్రగుంట్ల నగర పంచాయతీకి సంబంధించి 6,11, 15 వార్డుల్లో 2020 మార్చి నెలలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించడానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, ఇప్పుడు కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అభ్యర్థులకు తెలియజేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రీ నామినేషన్‌కు షెడ్యూల్ ఇలా.. రీనామినేషన్ కొరకు ఆయనషెడ్యూల్‌ను కూడా ఆ ఆదేశాల్లోనే పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు 2వ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు వరకూ సమయం ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి నామి నేషన్ల పరిశీలన చేస్తారని, 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసం హరణలకు సమయం ఇస్తన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్లరీ నామినేషను అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. అయితే మిగతా చోట్ల కూడా బలవంతపు ఏకాగ్రీవాలు జరిగాయని, వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వివిధ పార్టీలు కోరుతున్నాయి. వీటికి సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్ కు పంపించినా, వాటి పై నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికలు అంటేనే ఎన్నిక జరగాలని, ఇలా బలవంతంగా ఏకాగ్రీవాలు చేసుకోవటం ఏమిటి అని వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read