ఇప్పటికే, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం పేరుతో 6,117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహా బృంద నాట్యం గిన్నిస్‌ బుక్ ఆఫ్ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్ళి అదే ఇందిరా గాంధీ స్టేడియంలో, వేరొక గిన్నీస్ రికార్డు ప్రదర్సన జరిగింది. జడ కోలాటం అనే. సంప్రదాయ నృత్యాన్ని, గిన్నీస్ రికార్డు వరకు తీసుకెళ్లారు సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాల విద్యారులు.

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం రాత్రి జడల కోలాటాన్ని నిర్వహించారు. 2500 మంది. 125 బృందాలుగా. 125 వృత్తాల్లో. 125 జడలు అల్లి రికార్డును నెలకొల్పారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 411 పాఠశాలల విద్యార్ధులు జడ కోలాటంలో పాల్గొన్నారు. 36 నిమషాల పాటు, జడ కోలాటం ఆడి రికార్డు నెలకొల్పారు. కోలాటం ఆడుతూ, వివిధ రకాలలో జడలు అల్లటం, జడలు విప్పటం లాంటివి చేసారు.

లయ బద్ధంగా సాగిన ఈ ఆట కనువిందు చేసింది. స్టేడియం కోలాట శబ్దాలతో మారు మోగింది. ఈ క్రింది వీడియోలో మీరు చూడవచ్చు...

విజయవాడలో బందరు రోడ్డు విస్తరణలో భాగంగా నారాయణ కాలేజీ భవనాన్ని కూల్చివేశారు. అయితే, ఈ సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం జరిగి వారం రోజుల పైన అయినా, చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయవాడ కార్పొరేషన్ సిబ్బంది ప్రొక్లయిన్ల సాయంతో నారాయణ కాలేజీ భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేత సమయంలో ఆ భవనం చుట్టుపక్కల ఎవరూ లేకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. అయితే భవనం ఒక్కసారిగా కూలిపోయి అక్కడ ఉన్న ప్రొక్లయిన్ మీద పడింది.

భవనం మొత్తం ప్రొక్లయిన్ మీద పడినా, ప్రొక్లయిన్ డ్రైవర్ ఏ గాయాలు లేకుండా బయట పడ్డాడు... ఈ దృశ్యాలు క్రింది వీడియోలో మీరూ చూడండి..

నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు ఈ ఏడాది మరో చరిత్రను సృష్టించింది. గత రెండేళ్లలో ఊహించని విధంగా అనూహ్యంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సర్వీసుల సంఖ్య సైతం రెట్టింపైంది. దశాబ్దాలపాటు అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన విమానాశ్రయంలో మూడేళ్ల క్రితం వరకూ ఒకటి రెండు సర్వీసులు నడుస్తుండేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నవ్యాంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉన్న విజయవాడ విమానాశ్రయం 2016-17 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఆరన్నర లక్షల మంది ప్రయాణికులతో దేశంలోనే అత్యధిక వృద్ధి 61 శాతం సాధించింది. అర్ధ సంవత్సర ఫలితాలలో దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులన్నింటినీ పక్కనపెట్టి అగ్రపథంలోకి దూసుకువెళ్లింది. ప్రయాణికుల పరంగా, మొత్తం విమాన రాకపోకల పరంగా, ఫైట్స్ మూవ్మెంట్ పరంగా చూసినా, అగ్రస్థానంలో నిలవడం విశేషం.

2014- 15లో మొత్తం 14 విమానాలు వచ్చి వెళ్ళేవి. 2015 - 16 లో 21 విమానాలు వచ్చి వెళ్ళగా.. 2016 - 17 లో మాత్రం అత్యధికంగా 32 విమానాలు వచ్చి వెళ్లాయి. సంవత్సరం అంతా చూస్తే ల్యాండింగ్‌ , టేకాఫ్‌ అయిన విమానాల లెక్కలు తీస్తే విజయవాడకు విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ కలిపి మొత్తం 11,631 రాకపోకలు జరిగాయి. అదే 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే ల్యాండింగ్‌, టేకాఫ్‌ కలిపి 7,710 మేర రాకపోకలు సాగించాయి. ఏడాది మొత్తం విమానాల రాకపోకలలో ఈ ఏడాది 51 శాతం వృద్ధిని సాధించటం విశేషం. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6, 50, 463 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. అదే 2015 - 16లో 4, 04, 464 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది ప్రయాణీకుల రాక, పోకల ఆధారంగా 61 శాతం వృద్ధి కనిపించటం విశేషం.

రూ.160 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో, ఏటా 15 లక్షల మంది ప్రయాణికులు ఏ ఇబ్బందీ లేకుండా రాకపోకలు సాగించేందుకు వసతులు ఏర్పడ్డాయి. తాజాగా విమానాశ్రయాన్ని సైతం 500 ఎకరాల నుంచి మరో 700 పెంచి 1200 ఎకరాలు చేశారు. ప్రస్తుతం రన్వే విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌, ఎయిర్‌కోస్తా వంటి సంస్థలు, దిల్లీ, బెంగళూరు, వారణాశి, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, విశాఖలకు సర్వీసులు నడుస్తున్నాయి. మే 22 నుంచి ముంబయికి సైతం నూతన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కొచ్చిన్, కోల్కతా, అహమ్మదాబాద్ వంటి నగరాలకు సైతం ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది.

విదేశాలకు ఇక్కడి నుంచి సర్వీసులను నడిపే విషయంలోనూ కేంద్ర విమానయానశాఖ వద్ద ఫైల్ కదలికలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఎగరనున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కస్టమ్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసులకు అవసరమైన విభాగాలు సైతం ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాయి. ఆయా విభాగాల అధికారులతోనూ ఇప్పటికే సమావేశమై సాధ్యాసాధ్యాలను చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బెంజిసర్కిల్‌ వద్ద గల సర్వోత్తమ భవన్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో ఉచితంగా పుస్తకాలను అందజేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. చదవడం, ప్రచురణ, కాపీరైట్‌ ద్వారా మేథోసంపదను సంరక్షించడం వంటి కార్యక్రమాలను వృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 23వ తేదీన అంతర్జాతీయ పుస్తక కాపీరైట్‌ దినోత్సవం సందర్భంగా పుస్తకాలను ఉచితంగా నగర వాసులకు అందజేస్తున్నామన్నారు.

పిల్లల పుస్తకాలతో పాటు పాత, కొత్త కలయికతో వివిధ విషయాల్లో గల అనేక వేల పుస్తకాల నుండి పాఠకులకు వారికి ఇష్టమైన పుస్తకాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. సాహిత్యం, తత్వశాస్త్రం, అధ్యాత్మికం, సాంఘికశాస్త్రాలు, భాషాశాస్త్రం, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, కామర్స్‌, రాజకీయ, ఆర్థికశాస్త్రాలు తదితర పుస్తకాలను సేకరించి, కావలసిన వారికి అందించనున్నట్లు తెలిపారు. 30 వేల పుస్తకాలు సేకరించామని, ఏప్రిల్‌ 22, 23తేదీల్లో ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ బెంజిసర్కిల్‌ ఎదురుగా గల శ్రీ సర్వోత్తమ భవనంలో కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

గత సంవత్సరం విజయవాడ, గుంటూరు, విజయనగరం ప్రాంతాల్లో, 50 వేల పుస్తకాలు విషయ ప్రాతిపదికన విభజించి పంపిణీ చేసినట్లు తెలిపారు. నాటి ప్రజా స్పందనను గమనించి ఈ సారి మరింత విస్తృత స్థాయిలో పుస్తకాలను అందించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులు, యువకులతో పాటు వయో బేధం లేకుండా నగర ప్రజానీకం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నచ్చిన పుస్తకాన్ని ఉచితంగా తీసుకువెళ్లవచ్చని కోరారు.

పుస్తకాలు పొందడానికి కృష్ణాజిలా వారు 9290670671, 8520926313 ఫోన్‌ నెంబర్లను, గుంటూరు జిల్లా వారు 9533562539, 8008331880 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

విజయవాడ కనకదుర్గ గుడిలోకి ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తున్నారన్నది తెలుసుకోవడం సులభతరమయింది. భక్తులు ఎవరన్నది కూడా ఇట్టే తెలుసుకునేందుకు వీలవుతున్నది, తిరుమల, ఇంకా ఇతర పెద్ద ఆలయాలలో అమలులో ఉన్న సెక్యూరిటీ వ్యవస్థను దుర్గ గుడిలో కూడా అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.

తిరుమలలో కూడా డీవోటీ యాక్సెస్ విధానాన్ని అమలు చేసిన ట్రైలోక్ సంస్తే దుర్గ గుడిలో కూడా ఆ విధానాన్ని ఏర్పాటు చేసింది. దుర్గగుడి ఈవో సూర్యకుమారి యాక్సెస్ కారును ప్రారంభించి, పని చేసే విధానంపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

దుర్గగుడిలో ప్రస్తుతం ఉచితంగా దర్శనం చేసుకునే భక్తులకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. దర్శనానికి వచ్చే భక్తుల ఫొటోలను, ఐడింటిటీని ముందుగా తీసుకుని కార్డు ఇస్తారు. కార్డును మరల కౌంటర్లో చూపించిన తరువాత స్కాన్ చేస్తారు. ఆ తరువాత భక్తులు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో దర్శనానికి ఎవరు వచ్చారన్నది ఫొటోలో తెలిసిపోతుంది. దీంతో పాటుగా ఎంతమంది భక్తులు నికరంగా అమ్మవారిని దర్శించుకున్నారనే కాకిలెక్కలకు ఇక తావు ఉండదు.

భద్రతకు సంబందించి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. భక్తుడి ఫొటోను స్కాన్ చేస్తున్నందున ఆలయం లోపల ఎవైనా అనుకోని సంఘటనలు జరిగితే ఇట్టే గుర్తించేందుకు వీలుంటుంది. దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానంలో అమరావతి రాజధాని ఆయ్యాక అనేక నూతన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో దర్శనాల దగ్గరనుంచి ప్రతి అంశాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. అమ్మవారికి సంబంధించి ఇప్పటికే కొన్ని కొత్త రకాల ఆర్జిత సేవలు భక్తులకు పరిచయం అయ్యాయి.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read