క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారపార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. గత నెల 30 నుంచి హోం క్వారంటైన్లో ఉన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా ఆకస్మికంగా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు, ఆహారం సరిగా లేదని చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపాయి. ఆయన బంధువుకు పాజిటివ్ వచ్చి చికిత్సానంతరం కోలుకుని గుంటూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బంధువున్న క్వారంటైన్ కేంద్రంలో తగిన వసతుల్లేవని చెప్పడం అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రోజుకు రూ.500 వెచ్చించి ఒక్క వ్యక్తికి తగిన ఆహార పానియాలు, సౌకర్యాలు కల్పిస్తున్నా ముస్తాఫా బహిరంగంగా విమర్శలు చేశారని జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల్లో నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని, ఇంటివద్ద కంటే క్వారంటైన్ కేంద్రాల్లోనే వసతులు బాగున్నాయనే భావన కల్పించాలని జగన్ ఆదేశం మేరకు పౌష్టికాహారం అందిస్తున్నామని అధికారులు చెబుతు న్నారు.

ఈ విషయంపై మంగళవారం కలెక్టరేటక్కు వచ్చిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జిల్లా అధికారులతో చర్చించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఎన్ని రోజులు ఉండాలన్నదీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇక్కడా నెగటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత 14 రోజులు ఉండాల్సిందేనని అన్నారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఇంటికి పంపాలని కోరడం సరికాదన్నారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. అధికారులపై అనవసరంగా వత్తిడి తేవద్దు.. నెగిటివ్ రాగానే ఇంటికి వెళ్తానంటే కుదరదు.. సౌకర్యాల్లేవని వ్యాఖ్యలు చేయడం తగదు.. అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముస్తాఫా మాట్లాడుతూ కరోనా లక్షణాల్లేని వారిని ఇంటికి పంపిస్తే డ్రైఫ్రూట్స్ తిని రోగనిరోధక శక్తి పెంచుకుంటారని వ్యాఖ్యానించారు.

14 రోజులు దాటినా వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారని, వీరిలో గుండెజబ్బు, షుగర్ పేషెంట్లు ఉంటున్నారని అన్నారు. కనీసం వీరికి నిత్యం మందులు అవసరం కాగా వాటిని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. రోజుల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచడం సరికాదన్నారు. సోమవారం ఆయన తన నివాసం సమీపంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించడం వివాదంగా మారింది. తొలుత క్వారంటైన్ కేంద్రంలో, తర్వాత 28 రోజులు హోం క్వారంటైన్లో ఉన్న ఎమ్మెల్యే అధికారుల అనుమతి లేకుండా పర్యటించడం పై అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అధికార పార్టీలో నెలకొన్న ఈ ముసలం, సద్దుమణుగుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రతి రోజు హైకోర్ట్ లో ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉన్నాయి. అనుభవారాహిత్యమో, లేక దూకుడుగా, తొందరపాటుగా చేస్తున్న నిర్ణయాలో ఏమో కాని, జగన్ ప్రభుత్వానికి, ప్రతి రోజు ఏదో ఒక ఎదురు దెబ్బ అటు హైకోర్ట్ లో కాని, ఇటు సుప్రీం కోర్ట్ లో కాని తగులుతూనే ఉంది. నిన్న కాక మొన్న వైసీపీ రంగులు పై, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగలటం, అలాగే సుప్రీం కోర్ట్ కి వెళ్ళటం, అక్కడ కూడా, మళ్ళీ ఎదురు దెబ్బ తగలటం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో విషయంలో, జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఉత్తర్వులు.. తాజాగా రద్దు అయ్యాయి. గత ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, భాజపా నాయకుడు సుదీష్‌ రాంబొట్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

గత ఏడాది, ఏకపక్షంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసింది. అయితే ఈ నిర్ణయం పై, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎక్కడైనా ఆప్షన్స్ ఇస్తారు కాని, ఇలా ఒకేసారి బలవంతంగా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటే ఎలా అంటూ, విమర్శలు వచ్చాయి. గతంలో చంద్రబాబు గారి హయంలో, మునిసిపల్ స్కూల్స్ లో, ఆప్షన్ పెట్టి, ఎవరికి కావలసినట్టు వారిని, ఇంగ్లీష్ కాని, తెలుగు మీడియం కాని, ఎంచుకునే వీలు కల్పించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, అన్ని రకాల ప్రభుత్వ స్కూల్స్ లో, ఈ ఏడాది నుంచే కేవలం ఇంగ్లీష్ మీడియం చేస్తూ, అందరూ ఇంగ్లీష్ లోనే చదువుకోవాలి అంటూ, ప్రభుత్వం ఒక నిర్బంధ జీవో తీసుకు వచ్చింది.

అయితే, ఒక పక్క అందరూ మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తుంటే, జగన్ ప్రభుత్వం ఇలా తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యటం పై, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కూడా, ఇలా నిర్భంధం వద్దు అని, ఆప్షన్స్ ఇవ్వాలని, ఎవరికీ కావలసింది వారు ఎంచుకుంటారని చెప్పారు. అలాగే టీచర్స్ కి కూడా ఆ సామర్ధ్యం లేదని, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ టైం తీసుకుంటాయని, ఒక ఫేజ్ వైజ్ వెళ్లాలని, సలహా ఇచ్చారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగు మీడియం అవసరం లేదని, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ, ఎదురు దాడి చేసారు. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వండి, రాజ్యాంగం ప్రకారం, మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రపంచంలో ఎక్కడా లేని విధానం వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ముందుకు వెళ్లి, ఈ రోజు హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలోనూ రాజధాని తరలింపు ఆలోచన మాత్రం జగన్ సర్కారు మది నుంచి తొలగిపోవడం లేదని తెలుస్తోంది. తాజాగా మే 23న విశాఖకు సచివాలయం తరలించేందుకు కొత్త ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు కూడా దీనిని నిర్ధారిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి మే మొదటి వారానికి పూర్తిగా నియంత్రణలోకి వస్తేనే అని వారంటున్నారు. విశాఖకు రాజధాని తరలింపు కొన్ని నెలలుగా చర్చల్లో ఉంది. మార్చి, ఉగాది... మే తొలి వారం... ఇలా అనేక ముహుర్తాలు మారగా, తాజాగా మే 23 వినిపిస్తోంది. ఆ రోజున రాజధానిని విశాఖకు తరలించాలన్న భావానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. అయితే ఒక్కసారిగా కరోనా అన్ని ప్రాంతాలను వణికిస్తుండడంతో తరలింపు ప్రక్రియ ఎంతవరకు సాగుతుందన్నది అనుమానంగానే ఉందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం కరోనా అదుపులోకి వస్తే అప్పుడు తరలింపుపై ఆలోచన వేగవంతం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే మే నెలలో ముహూర్తానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ మే నెల్లో కాకపోతే ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వారు విశ్లేషిస్తున్నారు. అందుకే వీలయినంత వరకు మే నెలాఖరులోపే విశాఖకు తరలివెళ్లే అన్ని మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇక మరో పక్క, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే, ఉన్నట్టు ఉండి, రమేష్ కుమార్ ని తప్పించటం, గంటల్లోనే, కొత్త ఎలక్షన్ కమీషనర్ ని పక్క రాష్ట్రం నుంచి తీసుకురావటం, ఇలా అన్నీ చకచక జరిగిపోయాయి. ఇదంతా, వెంటనే పరిస్థితి కొంచెం అనుకూలంగా మారినా, ఎన్నికలకు వెళ్లిపోదామనే అని జగన్ ప్లాన్ గా తెలుస్తుంది.

అయితే మరో పక్క, జగన్ ప్లాన్స్ కి మోదీ గండి కొట్టారనే వాదన కూడా ఉంది. లాక్ డౌన్ పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారన్న అంచనాలు తలకిందులు చేస్తూ, మరో మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. ఏప్రిల్ 20 తర్వాత అత్యవసర సర్వీసులకే షరతులతో మినహాయింపులు ఇస్తామని, కరోనా పై కేంద్రం పకడ్బందీ వ్యూహంతో, జగన్ ప్లాన్స్ కి బ్రేకులు పడినట్టు తెలుస్తుంది. ఏపీలో మేలోగా రాజకీయ అజెండా అమలు చేయాలన్న ఆత్రంలో జగన్ ఉన్నారని, అయితే అది కుదరకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది. ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవంటూ తక్కువ చేసి చూపే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారని, టిడిపి కూడా ఆరోపిస్తుంది. అయితే, లాక్ డౌన్ మూడు వారాల పొడిగింపుతో సొంత అజెండా అమలుకు ఛాన్స్ లేదని అంటున్నారు. మరి మొండి పట్టుదలతో ఉన్న జగన్ ఏమి చేస్తారో చూడాలి.

కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి లో 8, కర్నూల్ లో 6, గుంటూరు లో 4, కృష్ణ జిల్లా లో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది మొత్తంగా...రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500 మార్క్ దాటి 502 కు పెరిగింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 114 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఒక్కరోజే 21 కేసులు నమోదు అయ్యాయి. నరసరావుపేట, దాచేపల్లిలో కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాచేపల్లిలో ఓ ఆర్​ఎంపీ వైద్యుడికి పాజిటివ్‌గా తేలడంతో..అతని వద్ద వైద్యచికిత్సలకు వచ్చినవారు..పెద్దసంఖ్యలో రక్తనమూనాలను అందించారు. కడప జిల్లాలో కొత్తగా ఇద్దరికి వైరస్‌ సోకడంతో బాధితుల సంఖ్య 33కు పెరిగింది. ప్రొద్దుటూరు చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు... అధికారులు ధ్రువీకరించారు.

ఈమె దిల్లీకి వెళ్లి వ‌చ్చిన వ్యక్తి సోద‌రిగా గుర్తించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితి చూస్తే.. నెల్లూరులో 56, కృష్ణాలో45 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్క రోజులోనే 8 పాజిటివ్‌ కేసులు నిర్ధరించారు. విజయవాడలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1687మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 45 పాజిటివ్, 892 నెగటివ్ వచ్చాయి. 751 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో చూస్తే..ప్రకాశం 42, చిత్తూరు జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 20పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. తాజాగా ఇద్దరు కోలుకున్నారు. కాకినాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి, పెద్దాపురానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి వైరస్‌ నుంచి కోలుకోవడంతో కాకినాడ జీజీహెచ్ నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.

వీరిద్దరు దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. మొత్తంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారినుంచి ముగ్గురు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 458 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మరో పక్క జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. ఏపీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 22.5 లక్షల మంది ఉన్నారని, భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డులో నిధులను వెచ్చించాలని కేంద్రం స్పష్టం చేసిందని, ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల అకౌంట్లను సేకరిస్తున్నారని, ఏపీలో కూడా కార్మికుల అకౌంటు నెంబర్లు సేకరించి రూ.5 వేలు చొప్పున అకౌంట్లలో జమ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు.

రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకీ ఇబ్బందికరంగా మారుతుంది. కమ్యూనిటీ స్ప్రెడ్ వైపు అడుగులు వేస్తుంది అనే చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారికి కరోనా పాజిటివ్‌ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారిని కలిసిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారి డ్రైవర్‌, అటెండర్‌, కార్యాలయ సిబ్బంది చిరునామాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులతో పాటు, ఆయన్ను పదే పదే అనేక సార్లు కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఈఅధికారి, గత కొన్ని రోజులుగా, అక్కడి ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తుంది. ఆ అధికారితో పాటు పని చేసిన, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ అధికారులతో పని చేసిన వారి అందరినీ, వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం ఉన్న వారికి టెస్టులు కూడా చేస్తునట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న కరోనా అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉంటున్న కరోనా అనుమానితులు.. పోలీసులపై దాడికి దిగారు. తమను ఇళ్లకు పంపేవరకు భోజనం చేయబోమంటూ నిరసన తెలిపారు. గస్తీ కాస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్​ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపిచడం వీలు కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ వినకుండా పోలీసులపై మట్టి గడ్డలతో, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి వారిని కేంద్రాలకే పరిమితం చేశారు.

అనంతపురం జిల్లాలో కరోనా నిర్ధరణ పరీక్షలను మరింత వేగవంతం చేసేందుకు మరో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే వైద్య కళాశాలలో ఓ ప్రయోగశాల ఉండగా.. బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్​డీటీ ఆసుపత్రిలో మరో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇక్కడ రోజూ 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని... రోజుకు 120 నమూనాలు పరీక్షించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. అనంతపురం వైద్యకళాశాల ప్రయోగశాలలోనూ 3 షిఫ్టుల్లో పనిచేసేలా సిద్ధమవుతున్నారు. ఇక మరో పక్క, అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవిడ్ - 19 మొబైల్ టెస్టింగ్ యూనిట్​ను ప్రారంభించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్​ టెస్టింగ్​ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనంలో వైద్య సిబ్బందితో పాటు టెస్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. Source: https://www.andhrajyothy.com/telugunews/corona-positive-to-tahsildar-2020041401235778

More Articles ...

Advertisements

Latest Articles

Most Read