ఏపి రాజకీయాల్లో, ప్రతి రోజు వార్తల్లో ఉండే నరసాపురం ఎంపీ రఘురామరాజు, ఈ రోజు ఏపిలో హిందూ మతం పై వరుస దాడులు జరుగుతున్నాయని, నిరసన దీక్ష చేసారు. అయితే దీక్షలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కూర్చున్నారు. మరో పక్క అమరావతి పోరాటం చేస్తున్న జీవీఆర్ శాస్త్రి కూడా ఈ దీక్షలో కూర్చున్నారు. అలాగే మరికొందరు కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ ఈ దీక్షలో పాల్గునటంతో, వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ, ధార్మికతకు, మత సామరస్యతకు పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని అనంరు. ముఖ్యంగా ఈ దాడుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, పిచ్చివాళ్ల పని అంటూ కొట్టిపారవేయడం, బాధితులపై ఎటువంటి చర్య తీసుకొనే ప్రయత్నం చేయక పోతూ ఉండడంతో హిందువుల మనోభావాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు,

దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులతో కలత చెందిన నేను గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు ఈ దీక్ష చేయతలపెట్టానని, దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వంను కోరడం కోసమే ఈ దీక్షను నిర్వహిస్తున్నానని అన్నారు. దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇటువంటి దాడులను అడ్డుకోని పక్షంలో రాష్ట్రంలో ప్రజల మధ్య మతసామరస్యం దెబ్బతిని, అశాంతి రాజుకొనే అవకాశం ఉంటుందనే ఆందోళనయే నన్ను ఈ దీక్ష జరపడానికి ప్రేరేపిస్తుందని, ఆ విధంగా జరిగితే రాష్ట్రాభివృద్ధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలని అన్నారు.

రాజధాని అమరావతికి వరుస షాకులు ఇస్తున్న ఏపి ప్రభుత్వం, ప్రజలు గత 270 రోజులుగా ఆందోళన చేస్తున్నా, పట్టించుకోక పోగా, వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నారు. రెండు రోజుల క్రితం, మంత్రి కొడాలి నాని, ఇక్కడ అమరావతిలో శాసన రాజధానిగా కూడా ఉండటానికి వీలు లేదు, నేను ఈ విషయం జగన్ కు చెప్పాను, ఆయన చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు అని చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందుతూ ఉండగానే, ఇప్పుడు అమరావతి ప్రజలకు మరో షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాలను, అక్కడ నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకువటంతో, అమరావతి వాసులు షాక్ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో గ్రామాలు అయిన నీరుకొండ, నవులూరు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక సహా మరి కొన్ని గ్రామాల నుంచి సిఆర్డీఏ కార్యాలయాలు తరలించారు. అక్కడ ఉన్న ఫైల్స్, ఫర్నిచర్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ కార్యాలయంలో ఉన్న, రికార్డులు అన్నీ, తుళ్ళూరులో ఉన్న కార్యాలయానికి తరలించారు. అయితే దీని పై రాజధాని రైతులు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మారో పక్క రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, దళిత సంఘాల జేఏసీలు చేస్తున్న పోరాట దీక్షలకు వివిధ పక్షాల నుంచి మద్దతు లభిస్తుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత జేఏసీలు 268 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతులు వాపోయారు. అమరావతిని రాజధానిగా ఆనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు అధికారం చేపట్టిన తరువాత మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో శాసన రాజధానిని కూడా లేకుండా చేయాలనే అనాలోచిత కలలు కంటున్న మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో గేట్లాట జరుగుతోంది. సెక్రటేరియట్ నిర్మాణం మొదలు ఇప్పటి వరకు వాస్తు పేరుతో, భద్రతా కారణాల పేరుతో గేట్ల నిర్మాణం, మూత జరుగుతోంది. నెలన్నర క్రితమే వాస్తు పేరుతో మూడు గేట్లను మూసేసిన అధికారులు.. తాజాగా సచివాలయంలో ప్రధాన ద్వారాన్ని బుధవారం బంద్ చేసేశారు. అసెంబ్లీ గేటు -2ను కూడా మూసేశారు. ఆ రెండు గేట్లకు అడ్డంగా సిమెంట్ ఇటుకలతో శరవేగంగా గోడ నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం, శాసనసభ అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు వెళ్లే సమయంలో యథావిధిగానే ఉన్న ద్వారాలు ఆ తర్వాత కొద్ది సేపటికే మూతపడ్డాయి. విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో గేట్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు నిర్మిస్తుండటాన్ని చూసిన అధికారులు, ఉద్యోగులు ఇదేం చిత్రమబ్బా అంటూ విస్తుపోయారు. వెలగపూడి సచివాలయం వాస్తు బాగోలేదని ఇటీవలే మూడు గేట్లను అధికారులు మూసేశారు. రెండు గేట్లకు ఏకంగా అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టగా, ఒక గేటును పూర్తిగా వినియోగించడం మానేశారు. ఇప్పటి వరకు సచివాలయంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ వినియోగించే గేటునే పూర్తిగా మూసేశారు.

శాసనసభకు వెళ్లే సమయంలో జగన్ ఉపయోగించే గేటును మూసేసిన అధికారులు, దానికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అటు సచివాలయానికి, ఇటు అసెంబ్లీకి ఒక్కో గేటు మాత్రమే మిగిలాయి. అసెంబ్లీ, సచివాలయం మధ్యన అంతర్గతంగా ఉన్న గేటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉండగా, రెండు రోజుల క్రితం కొడాలి నాని శాసనరాజధాని కూడా ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించగా, మరుసటి రోజునే సచివాలయం, అసెంబ్లీ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జగన్ రాజధాని మొత్తాన్ని విశాఖ తరలించేందుకే కుట్ర పన్నుతున్నారని, ఆ పన్నాగంలో భాగంగానే గేట్లాటకు తెరలేపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యానే గేట్లను మూస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబుతుండగా, సచివాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే గేట్లను మూసేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

సచివాలయం, అసెంబ్లీ గేట్లను మూసేయడం వెనుక అమరావతి ఉద్యమం సెగ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి ఆ ప్రాంత రైతులు ఉద్యమం ప్రారంభించారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజధాని పరిరక్షణ సమితి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ సమయంలో రైతులు, మహిళలు, రాజకీయ నాయకులు సీఎం బ్లాక్ కు వెళ్లే గేటు నంబరు వన్ వరకు చొచ్చుకొచ్చారు. ఆ ఘటనపై సాక్షాత్తు ఏపీ డీజీపీ సైతం సీరియస్ అయ్యారు. ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. వారిని అడ్డుకునే మార్గాలు లేకపోవడంతో పోలీసులు ప్రభుత్వ పెద్దలు, అధికారుల తిట్లు తినాల్సి వచ్చింది. సచివాలయం ఐదు గేట్లలో నాలుగింటిని మూసేయడంతో అందరూ ఒకే గేటు నుంచి లోపలకు ప్రవేశించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర వీవీఐపీలు సెక్రటేరియటకు వచ్చి వెళ్లే సమయంలో విజిటర్స్ తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలే కాదు, ఈ ప్రభుత్వంలో పని చేస్తున్న ఆఫీసర్లు కూడా విమర్శ తట్టుకోలేక పోతున్నారని, తెలుగుదేశం పార్టీ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. గతంలో మాస్కు అడిగిన దళిత మేధావి, డాక్టర్ సుధాకర్ ని, వేధింపులకు గురి చేసి, చివరకు పిచ్చోడిని చేసారని, ఆయన విధుల్లో పాల్గునటానికి మాస్కు అడగటమే పాపమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా అకారణంగా తమ పై నిందలు వేస్తున్నారని, తాము ఎంతో కష్టపడుతున్నా తమ పై నిందలు ఎందుకు వేస్తున్నారు అని, ఒక గిరిజన వైద్యాధికారి సోమ్లా నాయక్‌ ప్రశ్నించినందుకు, ఆయన్ను అరెస్ట్ చెయ్యమని కలెక్టర్ ఆదేశించటం దారుణం అని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోజరుగుతున్న సమీక్షలో, అందరి ముందు సోమ్లా నాయక్‌ ను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా, ఆయన్ను అరెస్ట్ చేయ్యండి అంటూ, పోలీసులని ఆదేశించటం పై, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రశ్నిస్తే తట్టుకోలేరా ? ఏమిటి ఈ దౌర్జన్యం అని నిలదీశారు. ఒక పక్క వైసీపీ నాయకులు వైరస్ వ్యాప్తి చేస్తుంటే, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.

ఈ రోజు నరసరావుపేటలో కలెక్టర్ సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా, వైద్య సబ్బంది తీరు పై, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పై అభ్యంతరం చెప్తూ, నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్‌ తన నిరసన తెలియచేసారు. తాము ప్రాణాలకు తెగించి, కష్ట కాలంలో పని చేస్తుంటే, మమల్ని కించ పరుస్తారా అని ప్రశ్నించారు. దీంతో గుంటూరు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హౌ డేర్ యు కాల్ మీ, హూ ఆర్ యు, అతన్ని అరెస్ట్ చెయ్యండి అంటూ, అక్కడ ఉన్న డీఎస్పీకి ఆదేశించారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందించింది. కలెక్టర్ తీరుని ఖండించింది. ఏదైనా తప్పు ఉంటే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోండి కనీ, ఈ విధంగా అరెస్ట్ చెయ్యండి అంటూ బహిరంగంగా చెప్పటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అరెస్ట్ ఆదేశాలు అమలు చేస్తే మాత్రం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతామని, ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే, మాకు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read