క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారపార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. గత నెల 30 నుంచి హోం క్వారంటైన్లో ఉన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా ఆకస్మికంగా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు, ఆహారం సరిగా లేదని చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపాయి. ఆయన బంధువుకు పాజిటివ్ వచ్చి చికిత్సానంతరం కోలుకుని గుంటూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బంధువున్న క్వారంటైన్ కేంద్రంలో తగిన వసతుల్లేవని చెప్పడం అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రోజుకు రూ.500 వెచ్చించి ఒక్క వ్యక్తికి తగిన ఆహార పానియాలు, సౌకర్యాలు కల్పిస్తున్నా ముస్తాఫా బహిరంగంగా విమర్శలు చేశారని జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల్లో నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని, ఇంటివద్ద కంటే క్వారంటైన్ కేంద్రాల్లోనే వసతులు బాగున్నాయనే భావన కల్పించాలని జగన్ ఆదేశం మేరకు పౌష్టికాహారం అందిస్తున్నామని అధికారులు చెబుతు న్నారు.
ఈ విషయంపై మంగళవారం కలెక్టరేటక్కు వచ్చిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జిల్లా అధికారులతో చర్చించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఎన్ని రోజులు ఉండాలన్నదీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇక్కడా నెగటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత 14 రోజులు ఉండాల్సిందేనని అన్నారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఇంటికి పంపాలని కోరడం సరికాదన్నారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. అధికారులపై అనవసరంగా వత్తిడి తేవద్దు.. నెగిటివ్ రాగానే ఇంటికి వెళ్తానంటే కుదరదు.. సౌకర్యాల్లేవని వ్యాఖ్యలు చేయడం తగదు.. అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముస్తాఫా మాట్లాడుతూ కరోనా లక్షణాల్లేని వారిని ఇంటికి పంపిస్తే డ్రైఫ్రూట్స్ తిని రోగనిరోధక శక్తి పెంచుకుంటారని వ్యాఖ్యానించారు.
14 రోజులు దాటినా వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారని, వీరిలో గుండెజబ్బు, షుగర్ పేషెంట్లు ఉంటున్నారని అన్నారు. కనీసం వీరికి నిత్యం మందులు అవసరం కాగా వాటిని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. రోజుల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచడం సరికాదన్నారు. సోమవారం ఆయన తన నివాసం సమీపంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించడం వివాదంగా మారింది. తొలుత క్వారంటైన్ కేంద్రంలో, తర్వాత 28 రోజులు హోం క్వారంటైన్లో ఉన్న ఎమ్మెల్యే అధికారుల అనుమతి లేకుండా పర్యటించడం పై అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అధికార పార్టీలో నెలకొన్న ఈ ముసలం, సద్దుమణుగుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.