ఒకే ఒక్కడు సినిమా, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పని తీరు నచ్చి, సినిమా తీసాను అని డైరెక్టర్ శంకర్ అన్న మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే, 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు అలా లేరు కాని, ఆయన ఆఫీసర్ లు మట్టికి దుమ్ము దులుపుతూ, ఒకే ఒక్కడు పార్ట్ - 2 చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాకి కొత్త కలెక్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. బాబు అహ్మద్ ఎంతో సమర్ధవంతమైన కలెక్టర్ గా పని చేశారు.. ఆయన స్థానంలో లక్ష్మీకాంతం గారు బదిలీ మీద వచ్చారు. చంద్రబాబు ఏరి కోరి, కృష్ణా జిల్లా లాంటి కీలాకమైన జిల్లాకి, లక్ష్మీకాంతం గారిని తెచ్చుకున్నారు.
చూడటానికి చాలా మృదువుగా ఉన్నా, కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకదశలో కలెక్టర్ లక్ష్మీకాంతం అడుగుతున్న వివరణలకు అధికారులకు చెమటలు పడుతున్నాయి. కలెక్టర్ తనిఖీల్లో సామాన్య ప్రజల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు.
బాధ్యతలు తీసుకున్న వెంటనే కలెక్టర్ ప్రత్యేకంగా గన్నవరం నియోజకవర్గంపై దృష్టి సారించారు. గన్నవరం బ్రహ్మలింగయ్య చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించారు. తాను ఏ రోజు, ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేస్తానో తనకే తెలియదని, తనిఖీల సమయంలో ఎటువంటి పొరపాట్లు తన దృష్టికి వచ్చినా సహించనని, ఈ విషయాన్ని ప్రభుత్వ ఆదికారులు, ఉద్యోగులు గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించి పని తీరులో జిల్లాను అగ్రగామిగా ఉంచాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలకు వెనుకాడబోనన్నారు.
తొలుత గన్నవరం తహసీల్గార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రస్తుతం పురాతనమైన భవనంలో ఉన్న తహసీల్గార్ కార్యాలయాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరించి నివేదికలను తమకు సమర్పించాలని, లక్ష్య సాధనలో మండలాన్ని అగ్రగామిగా ఉంచాలని తహసీల్దార్ మాధురీకి సూచించారు.
గన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య చికిత్స కొరకు విచ్చేసిన రోగులను ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలు వైద్యుల పనితీరుపై ఆరాతీశారు. హాజరుపట్టీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పేరు పేరున సిబ్బందిని పిలిచి వారు నిర్వర్తిస్తున్న విధులు గురించి ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా హాజరు పట్టీలో సంతకాలు చేయని ఉద్యోగి శ్రీహరినాయక్ కు తక్షణమే మెమో జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. సమయూపాలన తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రం లో నలుగురే విద్యార్థులు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యచెకితులయ్యారు. ప్రతిరోజూ 15 మంది చిన్నారులకు తగ్గకుండా హాజరుపట్టీలో హాజరుశాతం నమోదుకావటాన్ని గమనించిన కలెక్టర్ నేడు నలుగురే చిన్నారులు హాజరుకావటం పై అంగన్ వాడీ టీచర్ పి.అనూషను ప్రశ్నించారు. ఇక పై ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితులలో సహించబోనని ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వర్తిస్తున్నదో ఆ లక్ష్యాలను విస్మరించరాదని హెచ్చరించారు. అంగన్ వాడీ కేంద్రం అని తెలిసేవిధంగా భవనం పై బోర్డును ఏర్పాటుచేయక పోవటం ఆ శాఖ అధికారుల పనితీరుకు నిదర్శంగా భావించవలసి వస్తుందని వెంటనే భవనాన్ని శుభ్రపరచి నేమ్ బోర్డును ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం కేసరపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మీకంగా సందర్శించి మద్యాహ్నభోజన పథకాన్ని పరిశీలించి విద్యార్ధలతో ముచ్చటించారు. మద్యాహ్న భోజన పథకం నిర్వహణ పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తంచేశారు. దాతలు సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించటం అభినందనీయమని అయితే దాతల నుండి సేకరించిన విరాళాలు, ఖర్చుల పై ఎప్పటికప్పడు ఆడిట్ ను నిర్వహించి నివేదికలను కంప్యూటరీకరించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు.



