ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, తమ దూకుడు మాటలతో, ప్రతి సారి వివాదాస్పదం అవుతున్నారు. ఒక మంత్రి గారు అయితే ఏకంగా బూతులుతోనే మొదలు పెట్టి, బూతులతో ముగిస్తారు. మొదట్లో ఆశ్చర్య పోయిన ప్రజలు, రాను రాను ఆయన మాటలకు అలవాటు పడి పోయారు. ఇంతేలే అనుకుని సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇలా వివాదాస్పదంగా మాట్లాడే వారు రోజు రోజుకీ అధికార పార్టీలో పెరిగిపోతున్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, మంచివారు అనుకునే వారు కూడా ఇదే బాట పడుతున్నారు. పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సియం, మంత్రి ధర్మాన కృష్ణ దాస్, టీషర్టులు వేసుకునే వారు రైతులా అంటూ, ఒక బూతు మాట మాట్లాడారు. ఏదో పొరపాటున మాట్లాడను అని చెప్పకుండా, ఏమి పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు మీడియాలో రాసుకోండి అంటూ ప్రకటించారు. దీని పై పెద్ద దుమారమే రేగింది. అయినా మంత్రి మాత్రం క్షమాపణ చెప్పలేదు. ఎంతో హుందా గల వ్యక్తిగా పేరున్న ధర్మాన కృష్ణ దాస్ ఇలా మాట్లాడటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు మంత్రిగారు మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, చిక్కుల్లో చిక్కుకున్నారు. ఈ సారి ఉపాధి హామీ కూలీలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు, దుమారాన్ని రేపుతున్నాయి. ఉపాధి హామీ కూలీ సంఘాలు మంత్రి మాట్లదిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ధర్మాన కృష్ణదాస్ నిన్న శ్రీకాకుళంలో జెడ్పీ సమావేశంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి, వారు ఎదో రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నారు, అయినా కూలి డబ్బులు వస్తున్నాయి, వ్యవసాయ పనులు చేసి డబ్బులు సంపాదించాలి అంటే ఎక్కువ సేపు పని చేయాలి, అందుకే వ్యవసాయ పనులకు వెళ్ళకుండా ఉపాధి హామీ పనులకు వెళ్లి, రెండు గంటలు కాలక్షేపం చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారని, వ్యవసాయ పనులు ఉండే సమయంలో, ఉపాధి హామీ పనులు నియంత్రించే విధనం చూడాలి అంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల పై ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం స్పందిస్తూ, మంత్రి వ్యాఖ్యలు ఖండించి, ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. మేము కాయ కష్టాన్ని నమ్ముకుని, ఒళ్ళు వంచి, రేయి పగలు, వర్షం, ఎండ లెక్క చేయకుండా, కాయకష్టం చేసుకునే పని చేసుకునే వాళ్ళం అని, అంతే కానీ పని తప్పించుకుని కాలక్షేపం చేసుకుని డబ్బులు సంపాదించే రకాలు కాదని తమ లేఖలో తెలిపారు. ఇప్పుడిప్పుడే పనులు ఉంటున్నాయని, మొన్నటి దాక తినటానికి కూడా లేదని, ప్రభుత్వం అదుకోక పోగా, ఇప్పుడు పనులు తగ్గిస్తాం అంటూ మా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణం అని అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఒక భారీ పెట్టుబడిలో రిలయన్స్ జియో ఒకటి. అప్పట్లో చంద్రబాబు గారు విశాఖలో సాఫ్ట్వేర్ , ఫైన్ టెక్ హబ్ గా, గోదావరి జిల్లాలు ఆక్వా హబ్ గా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిపాలన, హాస్పిటల్స్, స్కూల్స్ హబ్ గా, అలాగే ప్రకాశంలో అతి పెద్ద పేపర్ మిల్, నెల్లూరులో విండ్ మిల్స్ తయారు చేసే గామేషా, కర్నూల్ సోలార్ హబ్ గా, అనంతపురం, కడపలో ఆటోమొబైల్ హబ్ గా, అలాగే చిత్తూరుని ఎలక్ట్రానిక్ హబ్ గా చేస్తూ, ప్రణాళికలు రచించి సక్సస్ అయ్యారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ హబ్ లో, రిలయన్స్ జియో కంపెనీ పెట్టుబడి పెట్టే విధంగా చంద్రబాబు గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలయన్స్ జియో భూమి పూజ కూడా చేసుకుడ్ని. దాదాపుగా 15 వేల కోట్ల పెట్టుబడ్తితో, 20 వేల మందికి వరకు ఉపాధీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ జియో ఫోనులు, సెట్ అప్ బాక్స్ లు తాయారు చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తిరుపతి ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న వికృతమాల దగ్గర, సుమారుగా 150 ఎకరాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుని, 136 ఎకరాలు ఇస్తూ చివరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థను ఇక్కడకు తీసుకుని రావటానికి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రి నారా లోకేష్ ఎంతో శ్రమించారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో, మొత్తం మారిపోయింది.

తిరుపతిలో కంపెనీ పెట్టటానికి రిలయన్స్ ముందుకు రాలేదు. దీంతో ఒకానొక సమయంలో కంపెనీ వెనక్కు వేల్లిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం, మేము ఇంకా చర్చలు జరుపుతున్నామని, కంపెనీ వెనక్కు వెళ్లలేదని ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో రిలయన్స్ జియో పరిశ్రమ ఏర్పాటుకు తాము వేరే భూమి కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఇటీవలే ఏపీఐఐసి రిలయన్స్ కు లేఖ రాసింది. పుత్తూరులో ఉన్న ఎలక్ట్రికల్ క్లస్టర్ లో భూమి ఇస్తామని, అక్కడ భూమిలో ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేవని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటాం అంటూ ప్రతిపాదన పెట్టినా, రిలయన్స్ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం లేదని తెలుస్తుంది. అయితే మరో పక్క రిలయన్స్ మాత్రం,గతంలో మేము 136 ఎకరాల భూమి కేటాయించిన సమయంలో 4 కోట్లు చెల్లించామని, ఆ డబ్బు తిరిగి తమకు ఇవ్వాల్సిందిగా కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రిలయన్స్ జియోకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేనట్టే ఉంది. మరి పరిశ్రమల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

సరిగ్గా వారం క్రితం, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాము ఒక విషయం చెప్తాము, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ ప్రకటన అందరూ చూడండి అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది. అందరూ ఏమైనా కొత్త సంక్షేమ పధకమో, లేకపోతే భారీ పెట్టుబడి గురించి కానీ, లేక జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు కాబట్టి, స్పెషల్ స్టేటస్ గురించి చెప్తారేమో అని ఆశగా ఎదురు చూసారు. తీరా చూస్తే, ఆ ప్రకటనా న్యాయ స్థానాలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీం కోర్టు జడ్జి పై, ఫిర్యాదు చేసిన విషయం. అది కూడా ఇంగ్లీష్ లో ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి, లేఖ మీడియాకు విడుదల చేసి, తమను ఏ ప్రశ్నలు అడగ వద్దు అంటూ చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం ముగించి వెళ్ళిపోయారు. అయితే దాని తరువాత ఈ విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ విషయం పై న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అవుతాయి, న్యాయమూర్తులు ఎలా రియాక్ట్ అవుతారు, అనే విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే వివిధ బార్ అసోసియేషన్ లు, వివిధ సీనియర్ అడ్వకేట్లు ఈ విషయం పై స్పందించారు. జగన్ పై ఘాటు విమర్శలు చేసారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, హైకోర్టు ఒక కేసు విషయంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆ గ్యాగ్ ఆర్డర్ కి విరుద్ధంగా, ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్ కానీ, లేఖ కాని ఉంది. అయితే ఈ విషయం పై హైకోర్టు కూడా స్పందించింది.

రాజధానికి సంబందించిన భూములు విషయంలో, ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ, కేసు వివరాలు కానీ మీడియాలో ప్రసారం చేయ కూడదు అని మేము ఆదేశాలు ఇస్తే, ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్ తో, అలాగే ముఖ్యమంత్రి రాసిన లేఖ బహిర్గతం చేయటంతో, మా ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయిందని, హైకోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ సవరించాలని, ఆ కేసు విషయాలు తమకు తెలియలాని, మమతారాణి అనే న్యాయవాది ఈ కేసు విషయంలో అనుబంధ పిటీషన్ దాఖలు చేసారు. తమకు ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ వేసారు. ఈ అనుబంధ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన అధిష్టానం, ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్, మీడియాకు ఇచ్చిన లేఖలతో, మేము ఇచ్చిన ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయాయని, ఇంకా దీని పై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని, ఈ అనుబంధ పిటీషన్ కూడా , మెయిన్ పిటీషన్ తో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇక పొతే, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీలో సోషల్ మీడియాలో పెడుతున్నారని, అవి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని, దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరుపు న్యాయవాది మరో అనుబంధ పిటీషన్ వేయాగా, ఇది కూడా అత్యవసర విచారణ అవసరం లేదని, సీరియల్ ప్రకారం బెంచ్ ముందుకు వస్తుందని కోర్టు తెలిపింది.

గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారికంగా, సుప్రీం కోర్టు జస్టిస్ తో పాటుగా, ఆరుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను టార్గెట్ చేస్తూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు, జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను, అధికారికంగా మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే లేఖ రాయటం పైన ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, కాబోయే చీఫ్ జస్టిస్ ను, అదీ ప్రజా ప్రతినిధుల పై కేసులు ఏడాదిలోగా తేల్చేయాలని ఆ జస్టిస్ బెంచ్ విచారణ చేస్తున్న సమయంలో, ఇలా టార్గెట్ చేయటం పై, అన్ని వైపుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వస్తున్నాయి. అన్ని సంఘాలు, పెద్ద పెద్ద న్యాయవాదులు, జగన్ వైఖరిని తప్పు బట్టారు. ఈ క్రమంలోనే, మొదటిగా స్పందించింది, ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్. జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అందులోని అంశాలను తప్పు బడుతూ ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసి, ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తీర్మానం పై సంతకం చేసింది ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిజిత్. అయితే ఎప్పుడైతే తాను జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసి మీడియాకు వదిలనో, అప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ, అభిజిత్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా బార్ అసోసియేషన్ సెక్రటరీకి బెదిరింపులు రావటం పై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అభిజిత్ ఈ రోజు లేఖ రాసారు. తాము జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ పై రాసిన లేఖ పై ఖండిస్తూ ఒక తీర్మానం చేసామని, ఆ తీర్మానం పై తన సంతకం ఉందని, ఈ తీర్మానం అక్టోబర్ 14న మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురితం అయిన విషయం చెప్తూ, తరువాత రోజు, అంటే అక్టోబర్ 15న తాను, తన ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా, ఉదయం 11 గంటల సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అవతల వ్యక్తి తాను, ఇండియన్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ కు సెక్రటరీ అని చెప్పారని, తరువాత తనను హిందీలో దుషిస్తూ, బెదిరించారని, ఎందుకు ఆ తీర్మానం చేసారు అంటూ తన పై దుర్భాషలాడారని తన ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఫోన్ పెట్టేసానని, తరువాత మళ్ళీ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇదే రకమైన బెదిరింపు ఫోన్ కాల్స్, తమ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహిత్ కి కూడా వచ్చాయని తెలిసిందని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ పరిణామంతో తమ కుటుంబం భయపడిపోయిందని, తమ హక్కులను కాపాడాలని పోలీస్ కమిషనర్ కు రాసిన ఫిర్యాదు లేఖలో, అభిజిత్ తెలిపారు. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేసారు, ఎవరు చేయమంటే చేసారు ? అనే విషయం పై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read